Begin typing your search above and press return to search.

చంద్రబాబు అందరికీ టార్గెట్ అయిపోయారే

By:  Tupaki Desk   |   14 Jun 2019 2:30 PM GMT
చంద్రబాబు అందరికీ టార్గెట్ అయిపోయారే
X
టీడీపీ అధినేత - ఏపీ తాజా మాజీ సీఎం - ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు... నిజంగానే ఇప్పుడు అందరికీ టార్గెట్ అయిపోయారు. తాజాగా ముగిసిన ఎన్నికలకు ముందు చంద్రబాబు అంటే... దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని సీనియర్ రాజకీయవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోయిన నవ్యాంధ్రను ఆ ఊబిలో నుంచి బయటపడేయడమే లక్ష్యంగా సాగిన చంద్రబాబు ఎక్కడికెళ్లినా కూడా గ్రాండ్ వెల్ కమ్ లభించేది. దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లలో ఒకరిగానే కాకుండా వ్యవహారంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరున్న చంద్రబాబు సలహాలు తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపేవారు.

అయితే తాజాగా ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో... నిన్నటిదాకా చంద్రబాబు అంటేనే భయపడిపోయే వాళ్లంతా ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారు. రాజకీయాలన్నాక గెలుపు - ఓటములు సహజమే కదా. మరి తాజా ఓటమితోనే చంద్రబాబును అందరూ టార్గెట్ చేస్తున్నారంటే... ఆ లెక్క అర్థం కావడం లేదనే చెప్పాలి. ఎన్నికల్లో ప్రధాని మోదీనే టార్గెట్ చేసిన చంద్రబాబు.... కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఫరవా లేదు గానీ, మళ్లీ మోదీ మాత్రం ప్రధాని కాకూడదన్న కోణంలో చంద్రబాబు చక్రం తిప్పారు. అయితే చంద్రబాబు లాంటి సీనియర్ల అండ దక్కినా కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ దానిని వినియోగించుకోలేకపోయింది. తాను చతికిలబడుతూ మోదీని మళ్లీ ప్రధానిని చేసింది. ఈ క్రమంలో ఏపీలో తన ప్రత్యర్థి - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును నేరుగానే టార్గెట్ చేశారు.

తొలి అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజునే జగన్... చంద్రబాబును తప్పుబడుతూ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటానన్నట్లుగా వ్యవహరించారు. తాను తలచుకుంటే... టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందే తన పార్టీలో చేరిపోతారని కూడా జగన్ వార్నింగిచ్చేశారు. తాజాగా బీజేపీ కూడా అదే మాట అంటోంది. చాలా మంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని, ఏ క్షఁణమైనా వారంతా తమ పార్టీలో చేరిపోతారంటూ బీజేపీ సీనియర్ నేత సొము వీర్రాజు సంచలన వ్యాఖ్య చేశారు. ఇక చంద్రబాబును బద్ద విరోధిలా చూసే టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే... తాజాగా అసలు ఊరూ పేరు లేని రిపబ్లిక్ పార్టీ ఏకంగా చంద్రబాబును ఇరుకునపెడుతూ ఏకంగా హైకోర్టునే ఆశ్రయించింది. మొత్తంగా టీడీపీకి దక్కిన తాజా ఓటమితో చంద్రబాబును అందరూ టార్గెట్ చేస్తున్నారు. మరి వీరిందరినీ చంద్రబాబు ఏ రీతిన ఎదర్కొంటారో చూడాలి.