Begin typing your search above and press return to search.

ఏం జరిగినా.. క్రెడిట్ మాత్రం కేసీఆర్ కే

By:  Tupaki Desk   |   6 Dec 2019 5:36 AM GMT
ఏం జరిగినా.. క్రెడిట్ మాత్రం కేసీఆర్ కే
X
దురదృష్టవంతుడ్ని ఎవరూ బాగుపర్చలేరన్న నానుడికి తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుడి అంతా ఇంతా కాదన్న మాట తరచూ వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరేలా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకునే పలు పరిణామాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్నర్ అవుతుంటారు. అయితే.. పడిన ప్రతిసారీ లేచి నిలబడే తీరుకు తగ్గట్లే.. తొలుత విమర్శలు వెల్లువెత్తినా చివరకు మాత్రం కేసీఆర్ ఖాతాకు క్రెడిట్ గా మారటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

దిశ ఉదంతాన్నే తీసుకోండి. దారుణమైన రీతిలో జరిగిన అమానమీయమైన ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశ కుటుంబ సభ్యుల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలవలేదన్న ఆగ్రహం వ్యక్తమైంది. ఇంటికి వెళ్లి పరామర్శ కుదరదు కానీ పెళ్లిళ్లకు వెళతారా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. తీరా చూస్తే.. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయటం.. వారిపై పోలీసులు కాల్పులు జరపటంతో దిశ నిందితుల కథ ముగిసినట్లైంది. మొన్నటివరకూ సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యక్తమైన ఆగ్రహావేశాల స్థానే.. ఇప్పుడెలాంటి కామెంట్లు పోస్టు అవుతున్నాయో చూస్తే విషయం ఇట్టే అర్థం కాక మానదు.

ఇదొక్క ఉదంతమే కాదు.. రెండు రోజుల క్రితం యాదాద్రిలో మూల విరాట్టుకు మార్పులు జరిగాయని.. ప్రభుత్వాధినేతకు తెలీకుండా జరిగిన ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కిందామీదా పడుతున్నట్లుగా సంచలన కథనం ఒకటి పబ్లిష్ అయ్యింది. అయితే.. ఈ ఉదంతంపై తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు మాత్రం ఈ విషయం వార్తాకథనం రూపంలో బయటకు రావటం.. తమకు వ్యతిరేకంగా రాతలు రాసే మీడియాలో రావటంపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నారు. రేపొద్దున మరో మాథ్యమంలో ఇదే విషయం బయటకు వస్తే జరిగే డ్యామేజ్ తో పోలిస్తే.. తాజా కథనంతో తాము ఈ ఇష్యూను ఎలా డీల్ చేయాలని మల్లగుల్లాలు పడుతుంటే.. కాగల కార్యం గంధర్వులే తీర్చిన చందంగా వ్యతిరేక మీడియా సంస్థలో వచ్చిన ఎక్స్ క్లూజివ్ కథనంతో ఓపెన్ కావటం కాస్తంత మేలు చేసే అంశంగా చెబుతున్నారు.

ఈ రెండు ఉదంతాలే కాదు.. 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్నే తీసుకున్నా ఇలాంటి పరిస్థితే నెలకొంది. సమ్మె విషయంలో కేసీఆర్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టటం.. దిష్టిబొమ్మలు తగలపెట్టటంతో పాటు.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎవరి ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం లొంగదన్న సందేశాన్ని ఇచ్చిన కేసీఆర్.. చివరకు సమ్మె చేస్తున్నకార్మికులే ఎలాంటి వరం ప్రభుత్వం ఇవ్వకుండా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించటం.. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవటం తెలిసిందే. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెర మీదకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేరమని చెప్పటంతో పాటు.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమన్న భరోసాను ఇచ్చేశారు. రెండు రోజులు తిరిగేసరికి వరాల మూటను విప్పి.. తనను తిట్టి.. శాపనార్థాలు పెట్టిన ఆర్టీసీ కార్మికుల చేతనే పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇలా.. తనకు ఇబ్బందిగా.. చిరాకు పుట్టించే ప్రతి ఉదంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని.. చివరకు మైలేజీ సొంతమయ్యేలా పరిణామాలు మారటం చూస్తే.. సుడి అంటే ఇదేనేమో? అన్న భావన కలగటం ఖాయం.