Begin typing your search above and press return to search.

సోనియమ్మ తప్పించి.. మిగిలిన వారంతా మార్కులు కొట్టేశారుగా

By:  Tupaki Desk   |   20 Jun 2020 8:10 AM GMT
సోనియమ్మ తప్పించి.. మిగిలిన వారంతా మార్కులు కొట్టేశారుగా
X
గాల్వాన్ ఘటన నేపథ్యంలో చైనా దురాగతంపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో అఖిలపక్ష సమావేశాన్నినిర్వహించారు ప్రధాని మోడీ. దేశ వ్యాప్తంగా ఐదుగురు ఎంపీలున్న ప్రతి పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందించారు. ఇందులో పాల్గొన్న వారు ఎవరేం మాట్లాడారన్నది అధికారికంగా వెలువడింది లేదు. ఎవరికి వారు వారికున్న సోర్సు ద్వారా.. ఫలానా మాట్లాడారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్లుగా చెబుతున్న వాట్సాప్ సందేశం ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది.

అందులో సమస్యను ప్రస్తావించటమే కాదు.. ఏమేం చేయాలన్న విషయంపై కేసీఆర్ వినిపించినట్లుగా చెబుతున్న వాదన అందరిని ఫిదా చేయటమే కాదు.. కేసీఆర్ లోని జాతీయ నాయకుడ్ని మరోసారి కళ్లకు కట్టేలా చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా కేంద్రంలోని మోడీ సర్కారు వెంట తామున్నామని తేల్చి చెప్పటమే కాదు.. మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాయి.

మోడీని విపరీతంగా విభేదించే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం.. మోడీ సర్కారుపై విమర్శల జోలికి వెళ్లకుండా చైనా తీరును తూర్పార పట్టారు. ఇలా.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అఖిలపక్ష నేతలంతా మోడీ సర్కారు తీసుకునే నిర్ణయానికి అండగా నిలుస్తామని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి.

మోడీ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారని చెప్పాలి. తాజాగా నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీని.. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి భారత్ లోకి చొరబడిన రోజే నిర్వహిస్తే బాగుండేదన్నారు. చైనా బలగాలు ఏ రోజు ఎల్ వోసీ దాటాయన్న విషయాన్ని కేంద్రం చెప్పాలని కోరారు. చైనా చొరబాట్లపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందలేదా? అని ప్రశ్నించిన ఆమె తీరు మోడీ సర్కారును కాస్తంత ఇరుకున పెట్టాయనే చెప్పాలి.

సోనియమ్మ నోటి నుంచి వచ్చిన మాటలు వాస్తవం కాదా? అంటే కాదని చెప్పలేం. కానీ.. సమయానికి తగ్గట్లుగా వ్యవహరించాలన్న చిన్న విషయాన్ని ఆమె మిస్ అయినట్లుగా చెప్పాలి. కష్టం వచ్చినప్పుడు ఇంటి పెద్దకు అండగా ఉంటామన్న భరోసా ముఖ్యం తప్పించి.. సదరు కష్టానికి ఇంటి పెద్ద సమర్థతలో తేడా ఎంతన్న విషయంపై చర్చించటం వల్ల ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి చర్చను దేశ ప్రజలు సైతం హర్షించరు. కానీ.. ఈ విషయాన్ని సోనియమ్మ మిస్ అయినట్లుగా కనిపించక మానదు.