Begin typing your search above and press return to search.

జనసేనను మాత్రం అంతా ఒకేలా చూస్తున్నారే!

By:  Tupaki Desk   |   9 April 2019 5:17 AM GMT
జనసేనను మాత్రం అంతా ఒకేలా చూస్తున్నారే!
X
పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న వేళ రాజకీయ పార్టీలు సర్వేలతో యుద్ధం మొదలుపెట్టాయి. ఎవరికి అనుకూల సర్వేలను వారు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏపీ విషయానికి వస్తే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని వివిధ నేషనల్ చానళ్లు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు కాదు కొన్ని నెలల నుంచినే అవి ఆ మాట చెబుతూ ఉన్నాయి.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవైకి తగ్గకుండా ఎంపీ సీట్లను సాధించుకునే అవకాశం ఉందని కొన్నాళ్లుగా వివిధ సర్వేలు చెబుతూనే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకా, ఇప్పుడు పోలింగ్ ముందు కూడా ఆ చానళ్లు అవే మాట చెబుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కొన్ని చానళ్లు మూడు ఎంపీ సీట్లు ఇస్తుండగా, మరికొన్ని ఐదారు వరకూ ఇస్తున్నాయి. ఐదారు సాధించినా టీడీపీ ఎన్నికల్లో చిత్తు అయినట్టే.

ఇక టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని కూడా కొన్ని చానళ్లు చెబుతూ ఉన్నాయి. అవి ప్రాంతీయ చానళ్లు. తెలుగుదేశం పార్టీ అనుకూలతతో వ్యవహరించే చానళ్లు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితమైన వార్తా చానళ్లుగా పేరున్న కొన్ని తెలుగు వార్తా చానళ్లు తెలుగుదేశం పార్టీదే విజయం అని అంటూ ఉన్నాయి!

ఇలా చానళ్ల సర్వే ప్రసారాల్లో వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్న సర్వేలు అయినా, ఇటు జనసేన గెలుస్తుందని చెబుతున్న సర్వేలు అయినా.. ఒకటే మాట మీద ఉన్నాయి. అది జనసేన విషయంలో.

పవన్ కల్యాణ్ పార్టీ ఒకటి నుంచి మూడు స్థానాలను సాధించే అవకాశాలున్నాయని అన్ని సర్వేలూ ముక్తకంఠంతో చెబుతూ ఉన్నాయి. తెలుగుదేశం గెలుస్తుందని చెప్పిన టీడీపీ అనుకూల చానళ్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన వీడీపీ - సీపీఎస్ వంటి సంస్థల సర్వేలు కూడా.. జనసేనకు వచ్చేది మాత్రం ఒకటి నుంచి మూడు సీట్లు మాత్రమే అని అంటున్నాయి! ఈ రకంగా జనసేన విషయంలో మాత్రం అవి ఒకే మాట మీదే నిలబడుతూ ఉన్నాయి!