Begin typing your search above and press return to search.

అందరి కళ్లూ కేబినెట్ వైపే..జగన్ ఏం చెబుతారో?

By:  Tupaki Desk   |   26 Dec 2019 5:14 PM GMT
అందరి కళ్లూ కేబినెట్ వైపే..జగన్ ఏం చెబుతారో?
X
శుక్రవారం అమరావతి కేంద్రంగా జరగనున్న ఏపీ కేబినెట్ భేటీ నిజంగానే హైటెన్షన్ కేబినెట్ భేటీ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే... ఏపీ రాజధానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకునేది ఈ కేబినెట్ భేటీలోనే కాబట్టి. ఇప్పటికే పది రోజుల క్రితం... ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చే మోనంటూ జగన్ సంచలన ప్రకటన చేశారు. జగన్ ప్రకటనకు అనుగుణంగానే రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది. ఈ నివేదికపై చర్చించి... రాజధాని పై కీలక నిర్ణయం తీసుకునేందుకే శుక్రవారం జగన్ తన మంత్రివర్గంలో సమావేశం కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో రాజధాని ఒకటే ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అన్నది తేలిపోనుందన్న వాదన వినిపిస్తోంది.

ఈ కారణంగానే శక్రవారం నాటి కేబినెట్ భేటీ పైనే రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా దృష్టి సారించేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ భేటీ... సుదీర్ఘంగా సాగనున్నట్లుగా సమాచారం. జీఎన్ రావు కమిటీ సిఫారసులను యథాతథంగా ఆమోదించడమా? లేదంటే... వాటిలో వేటికైనా మార్పులు, చేర్పులు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపే దిశగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయేమోనని స్వయంగా జగన్ చేసిన ప్రకటన - జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా అదే మాదిరిగా ఉన్న నేపథ్యంలో... ప్రస్తుతం అమరావతి పరిధిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం నాటి కేబినెట్ భేటీకి కూడా అడ్డంకులు సృష్టించేందుకు కూడా రైతులు సాహసించే అవకాశం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి పరిధిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... రేపటి కేబినెట్ భేటీలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై ఓ రకమైన చర్చ నడుస్తోంది. మూడు రాజధానులపై నేరుగా ప్రకటన చేయకుండా... జీఎన్ రావు కమిటీని యధాతధంగా ఆమోదించేసి కేబినెట్ భేటీని ముగిస్తారని తెలుస్తోంది. అంటే... తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే జగన్ ఈ కేబినెట్ భేటీలోనూ నేరుగా ప్రకటన చేసే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జీఎన్ రావు కమిటీ చేసిన సిఫారసులపై కేబినెట్ సబ్ కమిటీని వేసి... సదరు సిఫారసుల అమలు, రాజధాని రైతుల సమస్యల పరిష్కారం, కమిటీ సిఫారసుల అమలులో తలెత్తే ఇబ్బందులను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా సదరు కేబినెట్ సబ్ కమిటీ పనిచేసే దిశగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.