Begin typing your search above and press return to search.
నో మూవీస్ ఓన్లీ పొలిటీక్స్ : కమల్
By: Tupaki Desk | 13 Feb 2018 11:50 PM ISTతమిళనాట రాజకీయ అస్థిరత ఏర్పడ్డ సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ లు తమ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ ఇద్దరూ కలిసి పనిచేస్తారా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరూ స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన విశ్వనటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ రజనీకాంత్ పార్టీలో `కాషాయ` రంగు ఉంటే ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కమల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ -2018 పేరుతో ఏర్పాటు విద్యార్థులు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విద్య, వైద్యం వంటి కీలకమైన రంగాల్లో కూడా తమిళనాడు వెనుకబడి ఉందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పార్టీలు.... సాధారణ విషయాన్ని కూడా అసాధారణమని, అద్భుతమని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయని మండిపడ్డారు. తమిళనాడులోని ప్రతిజిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని డెవలప్ చేస్తానని, తనకు ప్రపంచం నలుమూలలనుంచి మద్దతు కావాలన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించాలన్నదే తన లక్ష్యమన్నారు. అందుకోసం తనకు డబ్బుకన్నా ఎక్కువగా నైతిక సహకారం, సలహాలు సూచనలు కావాలన్నారు. తాను ఒక రాజకీయ నాయకుడిని కాదని....కొత్త రకం `రాజకీయల` కోసం ప్రయత్నిస్తున్న నిత్య కృషీవలుడినని అన్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే లు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజల సమస్యల పరిష్కారానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తమిళనాడు రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని కమల్ అన్నారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని, సినిమాలు , రాజకీయాలు వేరువేరని కమల్ అన్నారు. తన రాజకీయ పార్టీ గుర్తులో `ఎరుపు`లేదని, అదే సమయంలో రజనీ పార్టీ గుర్తులో `కాషాయం` ఉన్న పక్షంలో ఆయనకు మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. తన సమకాలీన హీరోలతో పోలిస్తే తన సినిమాలు విభిన్నంగా ఉంటాయని, అదే తరహాలో తన రాజకీయాలు కూడా విభిన్నంగా ఉంటాయన్నారు. ఫిబ్రవరి 21 నుంచి ``నలాయి నమదే``(రేపు మనదే) పేరుతో ప్రజాయాత్ర చేపడుతున్నానని కమల్ చెప్పారు. రామనాథపురంలో ఉన్న దివంగత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి తన యాత్ర ను కమల్ ప్రారంభించబోతున్నారు. చివరిగా కమల్ ఒక షాక్ ఇచ్చాడు ఇక తాను మూవీస్ ఏమి చెయ్యను ఓన్లీ పాలిటిక్స్ అని అన్నాడు .. ఈ వార్త విని కమల్ అభిమానులు ఎలా తట్టుకుంటారో మరి చూడాలి .