Begin typing your search above and press return to search.

ఎన్డీఏలో వైసీపీ చేరికపై ఎందుకు ఉలికిపాటు ?

By:  Tupaki Desk   |   10 Oct 2020 10:10 AM GMT
ఎన్డీఏలో వైసీపీ చేరికపై ఎందుకు ఉలికిపాటు ?
X
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఓ సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు బీజేపీలోని కొందరు నేతల్లో ఒకటే ఉలికిపాటు కనబడుతోంది. ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భేటి తర్వాత వైసీపీ ఎన్డీఏలో చేరటం ఖాయమని ప్రచారం మొదలైపోయింది. ఎన్డీలో చేరమని ప్రధానికి జగన్ ఆఫర్ ఇచ్చారనేది ప్రచారంలో కీలకం. ఇదే సమయంలో ప్రధాని అసలు ఆఫరే ఇవ్వలేదని, అంతా వైసీపీ వర్గాలు చేయించుకుంటున్న ఉత్త ప్రచారం మాత్రమే అంటూ మరో ప్రచారం మొదలైపోయింది.

సరే ఈ ప్రచారాల సంగతి ఎలాగున్నా ఎన్డీఏలో జగన్ చేరడని, వైసీపీని ఎన్డీలో చేర్చుకునేది లేదనే ప్రచారాన్ని పదే పదే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రముఖంగా ప్రచారంలోకి తెస్తోంది. తమ వాదనకు మద్దతుగా పదే పదే బీజేపీ నేతలతో మాట్లాడిస్తోంది. అసలు ఈ సెక్షన్ ఆఫ్ మీడియాకు ఎందుకింత ఉలికిపాటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్డీఏ కూటమి ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందన్నది వాస్తవం. కూటమి మొత్తం మీద బీజేపి మాత్రమే అత్యంత బలంగా ఉంది. మిగిలిన పార్టీలను లెక్క తీసుకుంటే అంతా డొల్లే అన్న విషయం అర్ధమైపోతుంది. ఎందుకంటే చాలా పార్టీలకు లోక్ సభ లో బలం మహా అయితే నాలుగు, ఐదు ఎంపిలు కూడా లేరు.

ఇటువంటి నేపధ్యంలో వైసీపీని చేర్చుకోవాల్సిన అవసరం ఉందని మోడి అనుకుంటే ఆ విషయాన్ని జగన్ తో మాట్లాడుకుంటారు. ఒకవేళ జగన్ కూడా ఎన్డీఏ చేరాలని అనుకుంటే ఎటువంటి డిమాండ్లు పెడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎన్డీఏలో వైసీపీ చేరటం, చేర్చుకోవటమన్నది పరస్పర అవసరాల, అవకాశాల మీదే ఆధారపడుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒ విషయం అయితే ఖాయం. ప్రస్తుతం వైసీపీకి పార్లమెంటులో 28 మంది ఎంపిల బలం ఉంది. ఇంత బలమైన పార్టీ మద్దతును మోడి కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. రాజ్యసభలో ఇప్పటికే వైసీపీ మద్దతును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేకసార్లు కోరిన విషయం తెలిసిందే.

ఇక ఎన్డీఏలో వైసీపీ చేరాలా వద్దా అన్న విషయం కేవలం మోడి-జగన్-అమిత్ షా స్ధాయిలోనే డిసైడ్ అవుతుంది. అంతేకానీ ఏపి బీజేపీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్, ఎంఎల్సీ మాధవ్ లాంటి వాళ్ళకు సంబంధమే లేదు. వైసీపీతో ఎన్డీఏకి అవసరం అని మోడి అనుకుంటే జగన్ డిమాండ్లను ఆమోదించి కూటమిలో తీసుకుంటారు లేకపోతే లేదు. అంతేకానీ ఉలికిపడుతున్న మీడియానో లేకపోతే రాష్ట్రస్ధాయిలోని బీజేపీ నేతల అభిప్రాయాలనో అడిగి మోడి నిర్ణయం తీసుకుంటారా ? విచిత్రమేమిటంటే ఎన్డీఏ జగన్ చేరితే రాష్ట్రప్రయోజనాలకే మంచిదని తమిళ దినపత్రిక ’దినమలర్’ కూడా ప్రముఖంగా కథనం ప్రచురించింది. మొత్తానికి ఇక్కడ అర్ధం అవుతున్నదేమంటే జగన్ ఎన్డీఏలో చేరటం ఈ మీడియాకు ఇష్టం లేదన్నది ఉలికిపాటు వల్ల స్పష్టమవుతోంది.