Begin typing your search above and press return to search.

దేశం కోసం ఏకమైన సీఎంలు, భారత ప్రజలు..

By:  Tupaki Desk   |   21 March 2020 11:35 AM GMT
దేశం కోసం ఏకమైన సీఎంలు, భారత ప్రజలు..
X
అంతటా కరోనా పారదోలుదాం అనే మాట
అంతటా ఆ మహమ్మారిని పారదోలుదామనే సంకల్పం
అంతటా మనల్ని మనం కాపాడుకుందామనే పట్టుదల
అంతటా మనదేశాన్ని రక్షించుకుందామనే ప్రయాస
కులమతభాషలు పక్కన పెట్టేసి
ఇప్పుడు భారతీయులంతా ఒక్కటయ్యారు..
జనతా కర్ఫ్యూకు జై కొడుతూ
స్వీయ గృహ నిర్బంధం విధించుకుని
కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు సిద్ధమైన ప్రజలకు జయహో.. సెల్యూట్

ప్రపంచంలో భారతదేశం గొప్పతనం ఏమిటంటే ఐక్యత.. భిన్నత్వంలో ఏకత్వం. సున్నిత.. గొప్ప మనసున్న మనుషులు అని భారతీయులకు పేరు ఉంది. ఇప్పుడు మరోమారు చాటిచెప్పనున్నారు. దేశం కోసం ఎంతటి సాహసానికైనా.. త్యాగానికైనా వెనకాడని నైజం మనది. ఇప్పుడు అదే ఐక్యతా రాగం మరోసారి వినిపిస్తోంది. కరోనా వైరస్ మన దేశాన్ని ఏకం చేస్తోంది. ప్రజలందరూ కలిసి కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న ఆ కరోనాను దేశం నుంచి పారదోలేందుకు భారత ప్రజలు నడుం బిగించారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 22న ఆదివారం ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై స్వీయ గృహ నిర్బంధంలో ఉండనున్నారు. జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారు.

ఈ కరోనా మన భారతదేశ ఐకమత్యాన్ని చూసి పరిగెత్తే తరుణం వచ్చింది. భారతీయుల ఐక్యతను చూసి తోక ముడిచి వెళ్లనుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా.. వ్యక్తిగత అజెండా.. రాష్ట్రాల అజెండా తదితర వాటితో వేర్వేరుగా ఉన్న వారంతా ఇప్పుడు ఏకమయ్యారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో కలిసి జత కడుతున్నారు. రాజకీయాలు వేరు.. దేశానికి కష్టమొస్తే అందరూ కలిసి నిలబడతామని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు కూడా చేసి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జై కొట్టారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోదీతో కలిసిపోయారు.

ప్రాణాంతక వైరస్‌ పై మనమంతా పోరాటం చేద్దామని నరేంద్ర మోదీతో చేయి కలిపారు. ఈ విధంగా చేయీచేయి కలిపి దేశానికి పట్టిన కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులందరూ పార్టీలకతీతంగా దేశం కోసం ముందుకు వచ్చారు. అందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు మద్దతు పలికాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజా రవాణా.. సంస్థలు, కార్యాలయాలు అన్ని బంద్ చేస్తున్నారు. ప్రజలందరినీ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. సరికొత్త ఒరవడికి ఆదివారం అడుగ పడనుంది. భారతదేశ ఐక్యత మరోసారి ప్రపంచానికి తెలియనుంది. స్వాతంత్ర ఉద్యమం మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలంతా ఒక తాటిపై నిలవనున్నారు. ఇలాంటి అద్భుత పరిణామం మన కళ్లముందు జరగడం గమనార్హం. ఈ జనతా కర్ఫ్యూ చూసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రపంచానికి గొప్ప సందేశం భారతదేశం ఆదివారం ఇవ్వనుంది.