Begin typing your search above and press return to search.

బీజేపీ సీటుపై అన్ని పార్టీలు గురిపెట్టాయా?

By:  Tupaki Desk   |   20 July 2022 2:30 AM GMT
బీజేపీ సీటుపై అన్ని పార్టీలు గురిపెట్టాయా?
X
ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌లో బీజేపీ త‌ర‌ఫున పీవీఎన్ మాధ‌వ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయ‌న 2017లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. అప్ప‌ట్లో టీడీపీ-బీజేపీకి పొత్తు ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వ్ కు మ‌ద్ద‌తు ఇచ్చింది. దీంతో మాధ‌వ్ భారీ మెజారిటీతో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయ‌న ప‌దవీకాలంలో వ‌చ్చే ఏడాదితో ముగియనుంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ ఆ సీటుపై గురిపెట్టింది. ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ అప్పుడే అధికార పార్టీ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించేసింది. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఉన్న సీతంరాజు సుధాక‌ర్ ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి మొద‌టి నుంచి బ‌లం ఉంది. అందులోనూ గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం సిటీలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆ పార్టీయే గెలుచుకుంది. శ్రీకాకుళం జిల్లాలోనూ గ‌త ఎన్నిక‌ల్లో రెండు అసెంబ్లీ సీట్ల‌లో గెలుపొందింది.

మ‌రోవైపు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉత్త‌రాంధ్ర‌లో అభిమానులు భారీగానే ఉన్నారు. అందులోనూ ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో గాజువాక నుంచే పోటీ చేశారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ‌రిలో దిగాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటులో బీజేపీకి మొద‌టి నుంచి ప‌ట్టు ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. బీజేపీ మొద‌ట జ‌న‌సంఘ్ గా ఉండే కాలంలో బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచార‌ని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక శాసనమండలిని ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దాన్ని వైఎస్సార్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ తిరిగి పునరుద్ధరించారు. దీంతో రెండుసార్లు కమ్యూనిస్టులు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో గెలిచారు.

2017లో టీడీపీ మ‌ద్దతుతో పీవీ చలపతిరావు కుమారుడు పీవీఎన్ మాధవ్ బీజేపీ నుంచి పోటీ చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుచుకున్నారు. మ‌రోమారు కూడా బీజేపీ త‌ర‌ఫున ఆయ‌న దిగే అవ‌కాశాలున్నాయి.