Begin typing your search above and press return to search.

అక్కడ కొట్టడానికి బీజేపీ, ప్రతిపక్షాలు రెడీ

By:  Tupaki Desk   |   24 March 2019 9:26 AM GMT
అక్కడ కొట్టడానికి బీజేపీ, ప్రతిపక్షాలు రెడీ
X
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరి దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ పై పడింది. దేశవ్యాప్తంగా అత్యధిక లోక్‌ సభ స్థానాలున్న రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్‌ మొదటిది. 80 లోక్‌ సభ స్థానాలున్న ఈ రాష్ట్రం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో 71 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికే లోక్‌ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ రకరకాలుగా ప్రచారం చేస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తోంది. అటు ఎస్పీ, బీఎస్పీలు కలిసి ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో త్రిముఖ పోరు సాగనుంది. కాంగ్రెస్‌ ఒంటరిగా వెళ్తున్నా కొన్ని చోట్ల మాత్రం యూపీ, బీఎస్పీ కూటమికి సపోర్టుగా వెళ్తున్నట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ కు అనుకూలంగా తమ అభ్యర్థులను దించమని ఎస్పీ, బీఎస్పీలు ఒప్పందాన్ని చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో కులాలను బట్టి ఓటు బ్యాంకు మారనుంది. కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీలు కలిసి కులాల ఓట్లను సంపాదించాలని కసరత్తు చేస్తున్నాయి. కానీ వారు కలిసినా ఓట్లు రాబట్టే అవకాశాలు అనుమానమేనన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీ దుందుడుకు స్వభావానికి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు ముఖ్యమంతి యోగి చేస్తున్న ప్రక్షాళనకు తోడుగా మోడీ ప్రభంజనం రాష్ట్రంలో విపరీతంగా ఉండడంతో లోక్‌ సభ స్థానాలను చేజిక్కించుకునే అవకాశం ప్రతిపక్షాలకు వస్తాయా లేదా అన్న చర్చ రాజకీయంగా జోరుగా సాగుతోంది.

గత ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి ఎలాగైనా క్లీన్‌ స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది.. అయితే సర్వేల ప్రకారం రాష్ట్రంలో బీజేపీకి 50 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. కానీ ఎస్పీ కూటమి వేస్తున్న ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు వేస్తూ ఓటు బ్యాంకును బదిలీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీల కూటమిలో ఎవరు ముందుంటారో చూడాలి..