Begin typing your search above and press return to search.

కాన్ఫిడెంట్ గా సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ వర్గాలు!

By:  Tupaki Desk   |   25 Nov 2019 5:37 PM GMT
కాన్ఫిడెంట్ గా సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ వర్గాలు!
X
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల పట్ల బీజేపీ వ్యతిరేక పక్షాలు ధీమాతో కనిపిస్తూ ఉండటం గమనార్హం! అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాని మనుగడ ఉండదని బీజేపీ వ్యతిరేక వర్గాలు గట్టిగానే చెబుతూ ఉన్నాయి. ఎన్సీపీ బుట్టలో భారతీయ జనతా పార్టీ చేతులు పెట్టిన సంగతి తెలిసిందే.

పార్టీ ముఖ్య నేత అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా చేసేసి కమలం పార్టీ కథకు గట్టి ట్విస్ట్ ఇచ్చింది. అలా భారతీయ జనతా పార్టీ కీలకమైన ఘట్టాన్ని పూర్తి చేసినప్పటికీ.. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వర్గాల్లో చెదరని ధీమా అగుపిస్తూ ఉంది!

సేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల ప్రభుత్వమే ఏర్పడుతుందని శరద్ పవార్ ధీమాగా మరోసారి చెప్పారు. అజిత్ పవార్ ను అసలు ఏ మాత్రం ఖాతరు చేయనట్టుగా శరద్ పవార్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. తమ తో యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎన్సీపీ ముఖ్య నేత ఒకరు ప్రకటించడం గమనార్హం. కీలక నేతే బయటకు వెళ్లినా ఎన్సీపీలో మాత్రం ఈ తరహా ఆత్మవిశ్వాసం వ్యక్తం అవుతూ ఉంది.

ఇక శివసేన వాళ్లు అంతే ధీమాతో ఉన్నారు. తమ జోలికి బీజేపీ రాలేదనేంత కాన్ఫిడెన్స్ తో వారు కనిపిస్తూ ఉన్నారు. ఎన్సీపీ నుంచి ఒక నేతను, ఐదారు మంది ఎమ్మెల్యేలను అయినా తీసుకెళ్లగలిగారు, తమ నుంచి ఆ మాత్రం కూడా నేతలను చీల్చలేరని శివసేన ధీమాతో కనిపిస్తూ ఉంది. అంతే కాదు.. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకూ శివసైనికులు కాపాలా కాస్తున్నారట.

ఎటొచ్చీ కాంగ్రెస్ పార్టీకే దిక్కూ దివాణం కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చడం భారతీయ జనతా పార్టీకి కూడా కొంత తేలికగా కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ లో కొంతమంది పార్టీకి బద్దులైన నేతలున్నారు. ఫలితంగా అక్కడ నుంచి కూడా భారీ చీలికలు అయితే సాధ్యం అయ్యేలా లేవు.

మెజారిటీకి చాలా దూరంలో ఉండటం భారతీయ జనతా పార్టీకి మైనస్ పాయింట్ అవుతూ ఉంది. ఏ పది పన్నెండు మందో కావాల్సి ఉంటే కమలం పార్టీకి ఈ ఆపరేషన్ ఈజీ అయ్యేది. ఏకంగా ముప్పై మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండటంతో తక్కువ సమయంలో బలపరీక్ష ఎదురైతే వ్యవహారం సాఫీగా సాగే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.