Begin typing your search above and press return to search.

అఖిల‌ప‌క్షం భేటీ...ఊహించ‌ని మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   26 Feb 2019 2:45 PM GMT
అఖిల‌ప‌క్షం భేటీ...ఊహించ‌ని మ‌ద్ద‌తు
X
బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడుల విషయంలో దేశంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ సానుకూలంగా స్పందించాయి. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఈ మేర‌కు ఆయా పార్టీలు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించాయి. . అఖిలపక్ష భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌ - అరుణ్‌ జైట్లీ - కాంగ్రెస్‌ తరఫున గులాం నబీ ఆజాద్‌ - మల్లిఖార్జున ఖర్గే - నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు తీసుకునే అన్ని చర్యలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడులను మేం అభినందిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు మన సైనికులు తీసుకునే ఏ చర్యకైనా మేం పూర్తిగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకుండా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దళాలు దాడి జరిపిన తీరు అద్భుతమని గులాం నబీ ఆజాద్ ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జైషే ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్‌ చేపట్టిన మెరుపుదాడుల గురించి అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైకేల్‌ పాంపియోతో పాటు పలు దేశాల నేతలకు వివరించినట్లు నేతలకు ఆమె వివరించారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పార్టీల నేతలు సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో మద్దతిస్తున్నట్టు నేతలంతా చెప్పినట్టు ఆమె ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు ఒకే మాట మీద నిలబడి ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం - భద్రతా బలగాలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని పార్టీల నేతలు భారత వైమానిక దళాన్ని ప్రశంసించాయని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకించేందుకు అందరూ ఏకమవ్వాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇదిలాఉండ‌గా, ఒడిషా తీరంలో ఉపరితలం నుంచి గగనతలంలోని సత్వరమే ప్రయోగించగల రెండు క్షిపణులను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. భారత సైన్యం కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్షిపణులు 25 నుంచి 30 కిలోమీటర్ల లక్ష్యాలను సత్వరమే ఛేదిస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయుధాలను మోసుకెళ్లడమే కాకుండా ప్రత్యర్థి పక్షం గుర్తించి కూల్చేస్తాయి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్‌ ను భారత సైన్యం కోసం డీఆర్‌ డీవో ప్రత్యేకంగా తయారుచేసింది. బాలసోర్ జిల్లాలోని చాందీపూర్‌ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై నుంచి క్షిపణినీ విజయవంతంగా పరీక్షించారు.