Begin typing your search above and press return to search.

జగన్‌ కు అభ్యర్దుల తాకిడి

By:  Tupaki Desk   |   1 Sep 2018 6:42 AM GMT
జగన్‌ కు అభ్యర్దుల తాకిడి
X
వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి - లోక్‌ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపైన - కేంద్రంలో పాలిస్తున్న భారతీయ జనతా పార్టీపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే లోక్‌ సభ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీని కాని భారతీయ జనతా పార్టీని కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్వసించేలా లేరు. మరోవైపు ప్రతిపక్ష నాయుకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్రతో రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నారు. జగన్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సానుభూతి పెరుగుతోంది. ఇదీ ఆయనకు కలసివచ్చే కాలంలా కనిపిస్తోంది.

ఈ పరిణామాలను గమనిస్తున్న అన్ని పార్టీ నాయకులు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముఖ‌్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆరాటపడుతున్నారు. దీంతో సహజంగానే శాసనసభ - లోక్‌ సభ టిక్కెట్లపై పోటీ పెరిగింది. విజయం వరించడం తథ్యమని భావిస్తున్న నాయకులు జగన్ పంచన చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగులలో కొందరు శాసన సభ్యులు ప్రలోభాలకు తలొగ్గి అధికార పక్షం వైపు వెళ్లిపోయారు. అలా పార్టీ ఫిరాయించిన వారిపై ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గాలలో వైఎస్‌‌ ఆర్ కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ లో పోటీ పెరిగింది.

నెల్లూరు - ఉభయ గోదావరి - ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్కో స్థానానికి కనీసం నలుగురైదుగురు అభ్యర్దులు పోటీ పడుతున్నట్లు సమాచారం. అలాగే లోక్‌ సభ స్థానాలకు కూడా అభ్యర్దుల ఎంపిక జగన్‌ కు కష్టంగానే ఉంది. వాటికి పోటీ పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సిట్టింగ్ శాసనసభ్యులు - లోక్‌ సభ సభ్యులందరికీ టిక్కెట్లు ఇచ్చినా మిగిలిన స్థానాలలో అభ్యర్దుల ఎంపిక కష్టతరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.