Begin typing your search above and press return to search.

పవన్ యాత్రకు సర్వం సిద్ధం!

By:  Tupaki Desk   |   15 Sept 2022 6:02 PM IST
పవన్ యాత్రకు సర్వం సిద్ధం!
X
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కింగ్ మేకర్ కావాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాలలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలకు కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతే కాకుండా వారి పిల్లల చదువులకు అవసరమైన నిధిని కూడా సిద్ధం చేశారు.

కాగా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యప్తంగా యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. యాత్ర కోసం బస్సును యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. యాత్ర జరిగినన్ని రోజులు పవన్ బస్సులోనే ఉంటారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలవాట్లు, అవసరాలకు తగ్గట్టు బస్సును డిజైన్ చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ బస్సు యాత్రను ఎన్ని రోజులు చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 18న దీనిపై జనసేన పార్టీ వర్గాలు స్పష్టత ఇస్తారని అంటున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిజెపి పొత్తులో ఉన్న పవన్ ఎన్నికల నాటికి టిడిపి తో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వస్తున్నాయి.

జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశమని చెబుతున్నారు. బీజేపీ.. టిడిపితో పొత్తుకు ముందుకు రాని పక్షంలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తే తమ పుట్టి మునుగుతుందనే భయంలో వైఎస్సార్సీపీ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతుంది అని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.