Begin typing your search above and press return to search.

సౌత్ షాక్‌ తో డిఫెన్సులో పడిన మోదీ

By:  Tupaki Desk   |   13 April 2018 4:28 AM GMT
సౌత్ షాక్‌ తో డిఫెన్సులో పడిన మోదీ
X
ఎంతగా ఎదిరిస్తే అంతగా మొండికేసే మనిషి మోదీ. కానీ.. తేడా కొడుతుందంటే మాత్రం ఠక్కున డౌనవుతారు. చాలా అరుదుగా జరుగుతుంటుందది. ఇప్పుడు కూడా మోదీ దిగొచ్చారు.. అలా అని దారికొచ్చారనుకుంటే పొరపాటే. మాటల గారడీయే కానీ మాట నిలుపుకోవడం తెలియని మోదీ ఏపీ ప్రత్యేక హోదా గోడును పట్టించుకోలేదు కానీ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఎత్తిన తిరుగుబాటు జెండా చూసి మాత్రం కలవరపడ్డారు. అందుకే వెంటనే స్పందించి ఊరడింపు మాటలు మొదలుపెట్టారు.

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు తగినంత దక్కడం లేదని.. ఉత్తరాదికి దక్కుతున్న ప్రాధాన్యం దక్షిణాదికి లేదంటూ కేరళ - కర్ణాటక - ఏపీ ఆర్థిక మంత్రలు సమావేశం కావడంతో మోదీ కంగుతిన్నారు. ఇది ఇంకా ముదిరితే తన దక్షిణాది ఆశలకు గండి పడుతుందన్న టెన్షన్‌ మొదలైంది. దీంతో వెంటనే ఆయన మైకందుకోక తప్పలేదు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధులివ్వాలంటూ 15వ ఆర్థిక సంఘంపై మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఆ విషయంపై మోదీ మాట్లాడారు. ఆర్థిక సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించదంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దీన్ని కవర్ చేసేందుకు ఆయన పెద్ద ప్రయత్నమే చేశారు. జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని మాత్రమే తాము ఆర్థిక సంఘానికి సూచించామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తాము సహకార సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని అన్నారు. మరోవైపు 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు నిధులను ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సూచించిందని దక్షిణాది రాష్ట్రాలు ఎలుగెత్తుతూ 1971 జనాభాలెక్కల ఆధారంగా పన్నుల వాటాలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.