Begin typing your search above and press return to search.

ఫిరాయించేవాళ్లు లేక ప్లేటు ఫిరాయించిన టీడీపీ

By:  Tupaki Desk   |   8 March 2017 4:54 AM GMT
ఫిరాయించేవాళ్లు లేక ప్లేటు ఫిరాయించిన టీడీపీ
X
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైన నాటి నుంచి టీడీపీ రంకెలేసింది. రాష్ట్రంలో పార్టీల బలాబలాలను బట్టి టీడీపీకి 5 స్థానాలు - వైసీపీకి 2 స్థానాలు దక్కాలి. కానీ.. చంద్రబాబు - టీడీపీ నేతలు మాత్రం తాము ఆరో అభ్యర్థిని కూడా నిలబెడతామని చెబుతూ వచ్చారు. దాంతో వైసీపీ నుంచి మళ్లీ ఫిరాయింపులు ఉంటాయని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబు ఆరో అభ్యర్థిని పోటీకి దించాలనుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు.. టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎవరా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ.. అసలు సీను మాత్రం వేరు. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీలోకి వెళ్లేందుకు వైసీపీ నుంచి ఎవరూ ఆసక్తి చూపలేదట. దీంతో టీడీపీ ఆరో స్థానం ఆశలను పక్కనపెట్టేసి అయిదు స్థానాలతో సరిపెట్టుకుంది.

నామినేషన్ల గడువు ముగిసే సరికి టీడీపీ నుంచి ఐదుగురు - వైసీపీ నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు. ఏడు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే నమోదు అవడంతో ఓటింగ్‌ లేకుండానే అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గంగుల - ఆళ్ల నాని ఇద్దరూ ఎమ్మెల్సీలుగాఎన్నికయ్యారు. టీడీపీ నుంచి లోకేష్ - కరణం బలరాం - పోతుల సునీత - బత్తుల అర్జునుడు - డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

కాగా ఆరో అభ్యర్థిని నిలబెడతామంటూ హడావుడి చేసిన టీడీపీ కామ్ గా ఉండడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ ప్రభుత్వంవై వ్యతిరేకత వస్తుండడం.. జగన్ కు ఆదరణ పెరుగుతుండడంతో వైసీపీ నేతలెవరూ టీడీపీ పిలుపులకు స్పందించలేదట. మరోవైపు తన కుమారుడు లోకేష్ కూడా బరిలో ఉండడంతో ఆరో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా రిస్క్ తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధపడలేదని చెబుతున్నారు. కుమారుడి ఎన్నిక ఏకగ్రీవంగా సురక్షితంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆరో అభ్యర్థిని చంద్రబాబు బరిలో దింపేందుకు సాహసించలేదంటున్నారు. . కొత్తగా ఎవరూ నామినేషన్ వేయడానికి ఇక చాన్సు లేకపోవడంతో ఈ అయిదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీరి ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/