Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో మంత్రులంతా రాజీనామా..

By:  Tupaki Desk   |   21 Nov 2021 5:43 AM GMT
రాజస్థాన్ లో మంత్రులంతా రాజీనామా..
X
రాజస్థాన్ లో అనూహ్యమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేయటం తెలిసిందే. ఇలాంటివేళ.. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్తా చేసిన కీలక ప్రతిపాదనతో కొత్త రాజకీయ ముఖ చిత్రం చోటు చేసుకుంది.

అశోక్ గెహ్లోత్ మంత్రివర్గంలో ఆయనతో సహా 21 మంది ఉండగా.. ముఖ్యమంత్రి మినహా మిగిలిన మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు.మొత్తం 21 మందిలో ముందే ముగ్గురు మంత్రులు రాజీనామా చేయటం.. తాజాగా మిగిలిన పదిహేడు మంది తమ రాజీనామాల్ని ముఖ్యమంత్రికి అందజేశారు.

తమ మంత్రి పదవులకు ముందే రాజీనామా చేసిన మంత్రుల్లో హరీశ్ చౌదరి (రెవెన్యూ శాఖ).. రఘు శర్మ (వైద్య శాఖ).. గోవింద్ సింగ్ దోస్తారా (విద్యా శాఖ) ఈ ముగ్గురికి పార్టీకి సంబంధించిన కీలకమైన టాస్కును అప్పజెప్పారు. గోవింద్ సింగ్ ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే.. రఘు శర్మను గుజరాత్ పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా.. హరీష్ చౌదరీని పంజాబ్ పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా బాధ్యతలు అప్పజెప్పారు.

ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్న దాని ప్రకారం సచిన్ పైలెట్ వర్గానికి చెందిన నేతలకు కొత్త కాబినెట్ లో పదవులు లభించనున్నాయి. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో గరిష్ఠంగా 30 మంది వరకు మంత్రుల్ని ఎంపిక చేసే వీలుంది. తాజా మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో మొత్తం ఖాళీల్ని భర్తీ చేస్తారని చెబుతున్నారు. ఇందులో 12 మంది కొత్త వారికిచోటు కల్పిస్తారని.. సచిన్ పైలెట్ కు చెందిన ఐదుగురికి మంత్రి పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.

కొత్త మంత్రివర్గంలో బీఎస్పీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు కొందరు మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. కేబినెట్ కూర్పుపై ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లోత్.. సచిన్ పైలెట్ ఇద్దరు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చలు జరిపారు. మంత్రుల జాబితాను ఢిల్లీ నుంచి పంపారు. ఈ మధ్యాహ్నం (ఆదివారం) 2 గంటలకు పీసీసీ సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులు కొలువు తీరతారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.