Begin typing your search above and press return to search.

మోడీ సార్ రాష్ట్రాల ‘పన్ను’ పీకేశాడా?

By:  Tupaki Desk   |   29 Aug 2020 2:30 PM GMT
మోడీ సార్ రాష్ట్రాల ‘పన్ను’ పీకేశాడా?
X
బంగారు కత్తి అని మెడకోసుకుంటామా? ఇదీ అంతే సంస్కరణలు అంటూ ప్రధాని నరేంద్రమోడీ ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ అని సరికొత్త నినాదం ఇవ్వడంతో రాష్ట్రాలు అంత చంకలు గుద్దుకున్నాయి. 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని మోడీ సర్కార్ అమలు చేసింది. జీఎస్టీతో కోల్పోయే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతానని హామీ ఇచ్చింది.

అయితే 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు, వసూళ్లకు మధ్య ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల తేడా వచ్చింది. అయితే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన వాటా కేవలం 65వేల కోట్లు. ఇంకా 2.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది.

ఇదే విషయమై గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రశ్నించగా కేంద్రం చేతులు దులుపుకుంది. ఆదాయం తగ్గిన మొత్తాలకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాలని కేంద్రం సలహా ఇచ్చింది. దీంతో రాష్ట్రాలన్నీ లబోదిబోమన్నాయి.

కరోనా దెబ్బకు ఆర్థిక పరిస్థితి కుదేలు కావడం.. ఆశించినట్టు జీఎస్టీ వసూళ్లు లేకపోవడం వల్ల రాష్ట్రాలకు జీఎస్టీ పన్నుల ఆదాయాన్ని భర్తీ చేయలేకపోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతులెత్తేశారు.

దీంతో ఇప్పుడు రాష్ట్రాలన్నీ పాత పన్నుల విధానాన్నే ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ కింద తెలంగాణ కూడా 5400 కోట్లు నష్టపోయిందని వాపోయింది. ఇలా మోడీసార్ జీఎస్టీ ప్రయోగం రాష్ట్రాల నెత్తిన అప్పుల భారాన్ని మోపాయని వాపోతున్నాయి.