Begin typing your search above and press return to search.

పెళ్ళి మండపాలన్నీ ఖాళీ..పిలిచినా రావటం లేదు

By:  Tupaki Desk   |   14 Dec 2020 2:30 AM GMT
పెళ్ళి మండపాలన్నీ ఖాళీ..పిలిచినా రావటం లేదు
X
అవును ఏలూరులో పెళ్ళి మండపాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. వివాహాలకు రావాలని పేరు పేరునా ఆహ్వానపత్రికలు అందించినా రావటానికి భయపడుతున్నారు. లాక్ డౌన్ లేకపోయినా మండపాలు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి ? పిలిచినా ఎందుకు రావటం లేదు ? దీనికంతటికీ కారణం ఏమిటంటే ఏలూరు జనాలను వణికించేస్తున్న వింతవ్యాధే. అవునే వింతవ్యాధి కారణంగానే పెళ్ళిలే కాదు ఏ శుభకార్యానికి పిలిచినా హాజరవుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.

గడచిన పదిరోజులుగా ఏలూరును వణికించేస్తున్న వింతవ్యాధి కారణంగా వివాహాల్లో భోజనాలు చేయాల్సొస్తుందని చాలామంది వివాహాలకు హాజరు కావటం లేదట. వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది వివాహ ముహూర్తం అయిపోగానే భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారట. దాంతో ఆహ్వానితుల కోసం చేయించిన భోజనాలన్నీ వృధాగా పోతున్నాయి.

మామూలుగా కరోనా వైరస్ కారణంగా గడచిన ఎనిమిది మాసాల్లో వివాహాలు, శుభ కార్యక్రమాలను జనాలే వాయిదా వేసుకున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మంచి ముహూర్తాలుండటంతో పాటు ప్రభుత్వం కూడా కరోనా రిలాక్సేషన్ ఇవ్వటంతో వివాహాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఏలూరులో కూడా మ్యారేజి హాళ్ళని పదిరోజుల క్రిందటివరకు కిటకిట లాడిపోయేవి.

ఎప్పుడైతే వింతవ్యాధి పదిరోజుల క్రితం బయటపడిందో అప్పటి నుండే కొందరు వివాహా ముహూర్తాలను వాయిదా వేసుకుంటున్నారని సమాచారం. అప్పటికే దగ్గరకు వచ్చేసిన ముహూర్తాల విషయంలో చేసేది లేక వివాహాలు జరిపించేశారు. అయితే వీళ్ళు వివాహాలకు పిలిచినా వింతవ్యాధి కారణంగా అతిధులు హాజరవ్వటానికి భయపడ్డారట. తప్పని పరిస్దితులో హజరైన వాళ్ళలో కూడా చాలామంది భోజనాలు చేయకుండానే వెళ్ళిపోతున్నారట. మరి ఏలూరులో మామూలు పరిస్ధితులు ఎప్పుడు వస్తాయో ఏమో