Begin typing your search above and press return to search.

మోడీకి నిఘా వ‌ర్గాల వార్నింగ్‌..!

By:  Tupaki Desk   |   26 Jun 2018 8:57 AM GMT
మోడీకి నిఘా వ‌ర్గాల వార్నింగ్‌..!
X
ప్ర‌ధాని మోడీ భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు. తాజాగా నిఘా వ‌ర్గాలు చేసిన హెచ్చ‌రిక‌తో మోడీకి క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త‌ను మ‌రోసారి లోతుగా స‌మీక్షించ‌ట‌మే కాదు.. భ‌ద్ర‌తా ప‌రంగా మ‌రిన్ని మార్పులు చేర్పులు చేప‌ట్టారు. మోడీకి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు ఆయా రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక‌లు చేశాయి.

మోడీ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాలు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎవ‌రినీ ప్ర‌ధాని ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు అనుమ‌తించొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. చివ‌ర‌కు మంత్రులైనా కానీ.. కీల‌క అధికారులైనా కానీ మోడీ ప్ర‌త్యేక భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తించిన త‌ర్వాత మాత్ర‌మే ఆయ‌న వ‌ద్ద‌కు అనుమ‌తించాలని స్ప‌ష్టం చేస్తున్నారు.

ప్ర‌ధాని మోడీ ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించ‌టంతో భ‌ద్ర‌తా విభాగం వారు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీనే అత్య‌ధిక ప్రాధాన్య‌త క‌లిగిన ల‌క్ష్యంగా ఉన్న‌ట్లు జాతీయ భ‌ద్ర‌తా కౌన్సిల్ ఇత‌ర ఏజెన్సీల‌కు వెల్ల‌డించింది. రోడ్ షోల స‌మ‌యంలో ఆయ‌న్ను మట్టు పెట్టేందుకు వీలుగా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని ఇటీవ‌ల పూణె పోలీసులు వెల్ల‌డించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసే ముఖ్య‌నేత మోడీనే కావ‌టంతో.. ఆయ‌న చేత రోడ్ షోలు చేయించొద్ద‌ని.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌క‌పోవ‌ట‌మే మంచిద‌న్న మాట‌ను భ‌ద్ర‌తా వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. మోడీకి సెక్యురిటీ క‌ల్పించే అధికారుల‌కు ప్ర‌త్యేక అదేశాలు జారీ చేశారు.

మోడీకి ద‌గ్గ‌ర‌గా ఎవ‌రినీ రానీయొద్ద‌ని.. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లే సంద‌ర్భాల్ని సైతం బాగా త‌గ్గించాల‌న్న సూచ‌న‌ను హోం మంత్రిత్వ శాఖ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీకి అత్యంత స‌మీపంలో ఉండే ఈ బృందానికి ప్ర‌ధాని ర‌క్ష‌ణ‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.