Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌పై కేసుల ఎత్తివేత‌కు 120 జీవోలు!

By:  Tupaki Desk   |   9 Aug 2017 12:41 PM GMT
త‌మ్ముళ్ల‌పై కేసుల ఎత్తివేత‌కు 120 జీవోలు!
X
అధికారంలో ఉన్న‌ప్పుడు ఎడాపెడా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం మామూలే. తొమ్మిదిన్న‌రేళ్లు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. త‌న ప‌ద‌వీ కాలంలో పాల‌నాప‌ర‌మైన ఎన్ని త‌ప్పులు తీసుకున్నార‌న్న విష‌యాన్ని తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర‌చూ చెబుతుంటారు. ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబు.. తప్పుల మీద త‌ప్పులు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అలాంటి వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చేలా తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి వ్యాఖ్య‌లు ఉన్నాయి.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దాదాపు 251 మంది టీడీపీ నేత‌ల‌పై ఉన్న కేసుల్ని ఎత్తి వేస్తూ ఏకంగా 120 వ‌ర‌కూ జీవోలు ఇచ్చిన‌ట్లుగా ఆళ్ల ఆరోపిస్తున్నారు. త‌న వాద‌న‌లు వినిపిస్తూ హైకోర్టు త‌లుపు త‌ట్టారు. జీవోలు జారీ చేసి ఎత్తి వేసిన కేసులు తీవ్ర‌మైన‌వ‌ని.. వాటి స్వబావం ఏంటో చెప్పాలంటూ హైకోర్టు ఆళ్ల‌కు సూచ‌న చేసింది. ఇదిలా ఉంటే ఉప‌సంహ‌రించిన 251 కేసులు టీడీపీ నేత‌ల మీద‌నే ఉన్న‌వ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆళ్ల దాఖ‌లు చేసిన పిటీస‌న్ చీఫ్ జ‌స్టిస్ ర‌మేష్ రంగ‌నాథ‌న్‌.. జ‌స్టిస్ జె. ఉమాదేవిల బెంచ్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. అన‌వ‌స‌ర‌మైన కేసుల్ని ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి ఉంటుందే త‌ప్పించి.. కీల‌క‌మైన కేసులు.. తీవ్ర‌మైన‌.. ఘోర‌మైన క్రిమిన‌ల్ కేసుల్ని ఉప‌సంహ‌రించుకోవ‌టానికి అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

హైకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ ముఖ్య‌మంత్రిని ఇరుకున పెట్టేవిగా చెబుతున్నారు. ఏపీ స‌ర్కారు ఎత్తివేసిన కేసుల్లో ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రుల‌తో పాటు.. ఎమ్మెల్యే క‌మ్ సీఎం వియ్యంకుడు బాల‌కృష్ణ‌తో పాటు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ల‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల్ని కూడా ఉప‌సంహ‌రించుకున్నార‌ని ఆళ్ల త‌న పిటీష‌న్ లో పేర్కొన్నారు. వీరేకాక ప‌లువురు మంత్రులు.. ఎమ్మెల్యేల మీద కూడా కేసుల్ని ఎత్తి వేసింద‌న్నారు.

కేసుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా ప్ర‌భుత్వం త‌ప్పుడు సంకేతాలు పంపుతుంద‌న్న వాద‌న‌ను ఆళ్ల త‌ర‌ఫున న్యాయ‌వాది పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. నేరాలు చేసిన వారు ఎవ‌రైనా స‌రే.. అధికార‌పక్షాన్ని ఆశ్ర‌యిస్తే అవి ఇట్టే మాపీ అయిపోతాయ‌న్న భావ‌న క‌లిగేలా ప్ర‌భుత్వ తీరు ఉంద‌న్నారు. తాజా కేసుపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. న్యాయ‌స్థానం కానీ జీవోల జారీని త‌ప్పు ప‌డితే.. అది భారీ ఎదురుదెబ్బ అవుతుంద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.