Begin typing your search above and press return to search.

రాజ‌ధాని బిజినెస్ బాబుకు క‌లిసొచ్చింద‌ట‌!

By:  Tupaki Desk   |   8 Sep 2017 10:11 AM GMT
రాజ‌ధాని బిజినెస్ బాబుకు క‌లిసొచ్చింద‌ట‌!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రంగా, దేశానికే ఆద‌ర్శంగా తీర్చి దిద్దుతాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కాంట్రాక్టుల వెనుక మ‌త‌ల‌బు ఏంటి? ఎంత మేర‌కు నిధులు మింగేస్తున్నారు? అందుకే అమ‌రావ‌తి నిర్మాణాలు పుంజుకోవ‌డం లేదా? నిజానికి శివ‌రామ‌కృష్ణ క‌మిటీ రాజ‌ధానిని కృష్ణా న‌ది ఒడ్డున వ‌ద్ద‌న్నా బాబు భుజానికి ఎందుకు ఎత్తుకున్నారు? ఇక్క‌డే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎందుకు నిర్మిస్తున్నారు? వ‌ంటి కీల‌క‌మైన ప్ర‌శ్న‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. తాజాగా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అన్న‌ట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. అవేంటో చూద్దాం..

రాజధాని పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని, అవినీతి చేస్తూ ఆ సొమ్మంతా తన ఖజానాకు తరలించుకుంటున్నారని ఆర్కే విమ‌ర్శించారు. రాజ‌ధానిగా పనికి రాదని కేంద్రం నియ‌మించిన క‌మిటీ తేల్చి చెప్పింద‌ని.. అప్పటి చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్టారావు కూడా చెప్పార‌ని, అయినా కూడా బాబు ఎందుకిలా మొండిగా అక్క‌డే రాజ‌ధాని నిర్మిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు? అనుభవజ్జుల మాటలు చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళ్లారని, ప్రశ్నించిన అధికారులను తప్పించి ఆ స్థానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

వైఎస్ హ‌యాంలో సాధారణ ప్రజల నుంచి అధికారుల దాకా ఏనాడూ ఆయన నిర్ణయాన్ని వేలెత్తి చూపిన దాఖలాలు లేవని, కానీ, బాబుతీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని ఆళ్ల ఆరోపించారు. రాజధాని కోసం పేద ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ల్యాండ్‌​ పూలింగ్‌ పేరిట 33 వేల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆర్కే తెలిపారు. 9 నగరాలంటూ చెప్పిన చంద్రబాబు అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణాల‌పై సీబీఐతో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొత్తానికి రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు మెడ‌కు రాజ‌ధాని భూముల బాగోతం, నిర్మాణాలు చుట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.