Begin typing your search above and press return to search.

ఆర్కేకు కోడెల దొరికిపోయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   29 Aug 2017 10:40 AM GMT
ఆర్కేకు కోడెల దొరికిపోయిన‌ట్టేనా?
X
ఆర్కేగా మ‌నం పిలుచుకునే గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పేరు వింటేనే అధికార టీడీపీ హ‌డ‌లెత్తిపోతోంది. అధికార పార్టీ సాగిస్తున్న అక్ర‌మాలు - అన్యాయాలు - ఆశ్రిత ప‌క్ష‌పాతం - నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తున్న వైనం త‌దిత‌రాల్లో ఏ అంశంపై - ఏ మార్గంలో - ఎలా దూసుకువ‌స్తారోన‌న్న భ‌యంతో నిజంగానే టీడీపీ బెంబేలెత్తిపోతోంది. మొన్న‌టికి మొన్న కారు చౌక‌గా స‌దావ‌ర్తి భూముల‌ను ఓ టీడీపీ నేత‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం సిద్ధం కాగా.. ఆర్కే దానిని అడ్డుకున్నారు. స‌ద‌రు భూముల కొనుగోలు దాదాపుగా పూర్తి అయినా కూడా కోర్టు సాయంతో ఆర్కే ఆ విక్ర‌యాన్ని ఆపించగ‌లిగారు. సొంతంగా రూ.27 కోట్ల‌ను కోర్టు వ‌ద్ద డిపాజిట్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడ‌ని ఆర్కే... త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వెలుస్తున్న న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోస‌మంటూ ప్ర‌భుత్వం చేప‌డుతున్న బ‌ల‌వంతపు భూ సేక‌ర‌ణ‌కు ఆర్కే ఎదురొడ్డి మ‌రీ పోరాడుతున్నారు. రైతుల ప‌క్షాల ఆయ‌న చేస్తున్న పోరు నిజంగా అభినందించాల్సిందేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఇక ఇటీవ‌ల చిన్న‌పాటి వ‌ర్షానికి అసెంబ్లీలోని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్ లోకి నీళ్లు వ‌చ్చిన వైనంపై అటు చంద్ర‌బాబు స‌ర్కారుతో పాటు ఇటు అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ నానా యాగీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్కే సంధించిన ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు బాబు బ్యాచ్‌ తో పాటు కోడెల యంత్రాంగం కూడా సైలెంట్ కాక త‌ప్ప‌లేదు. ఒక్క జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ లోనే కాకుండా మంత్రులకు కేటాయించిన ఛాంబ‌ర్ల‌లోనూ వ‌ర్షపు నీరు లీకైంద‌ని, అధికార పార్టీ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఒక్క జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ ను మాత్ర‌మే చూపించి... మంత్రుల ఛాంబ‌ర్ల‌లోకి ఎవ‌రూ వెళ్ల‌కుండా అడ్డుకుంద‌ని ఆర్కే ఆరోపించగా... అప్ప‌టిదాకా నానా రచ్చ చేసిన వారంతా పేను కుట్టిన దొంగ‌ల్లా సైలెంట్ అయిపోయారు. ఇవ‌న్నీ తెలిసిన‌వేగా... తాజా అంశ‌మేంటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. స్పీక‌ర్ స్థానంలో ఉన్న ఏ పార్టీ నేత అయినా పార్టీల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఆ స్థానంలో ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌ - గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నియోజక‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విప‌క్షం ఎప్ప‌టినుంచో ఆరోపిస్తోంది.

ఇప్పుడు ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌న్న వాస్త‌వాన్ని ఆర్కే బ‌య‌ట‌పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. కేవ‌లం ఆరోప‌ణ‌ల‌తోనే స‌రిపెట్టుకోని ఆర్కే... ఆ విష‌యాన్ని ఏకంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టుకు తెలిపారు. ఆ విష‌యం వివ‌రాల్లోకి వెళితే... అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో అసెంబ్లీ కార్య‌క‌లాపాల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల హ‌క్కుల‌ను ఏదేని ఓ సంస్థ‌కు కేటాయిస్తారు. ఇందుకు నియ‌మ నిబంధ‌న‌లు ఉన్నాయి. వాటి ప్ర‌కారం టెండ‌ర్లు ఆహ్వానించి - త‌క్కువ‌కు కోట్ చేసిన వారికి ఆ హ‌క్కుల‌ను కేటాయించాల్సి ఉంటుంది. అయితే స్పీక‌ర్‌గా కోడెల ఈ నియ‌మ నిబంధ‌న‌ల‌ను ప‌క్కన‌పెట్టేసి... త‌న‌కు ఇష్ట‌మైన వారికి ఆ హ‌క్కుల‌ను నామినేష‌న్ ప‌ద్ధ‌తిన క‌ట్ట‌బెట్టేశార‌ట‌. స‌మాచార హ‌క్కు చ‌ట్టం అనే అస్త్రాన్ని ప్ర‌యోగించిన ఆర్కే... ఆ హ‌క్కుల‌ను ఎవ‌రికి కేటాయించారు? ఎలా కేటాయించారు? అనే అంశాల‌పై స్పీక‌ర్ కార్యాల‌యం నుంచే ప‌క్కా స‌మాచారాన్ని రాబ‌ట్టారు. ఈ స‌మాచారం ఆధారంగా ఆయ‌న నేటి ఉద‌యం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

త‌న‌కు అందిన స‌మాచారం మేర‌కు స్పీక‌ర్ హోదాలో కోడెల ఈ హ‌క్కుల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టెండ‌ర్లు పిల‌వ‌కుండానే.. 2018 చివ‌రి దాకా అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్ అనే నామినేష‌న్ ప‌ద్ధ‌తిన క‌ట్టబెట్టార‌ని ఆర్కే ఆరోపించారు. స‌ద‌రు సంస్థ య‌జ‌మానికి టీడీపీ అనుకూల ప‌త్రిక‌గా ముద్ర‌ప‌డ్డ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య‌కు చెందిన‌ద‌ని కూడా ఆళ్ల కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు రెండు వారాల్లోగా కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని అటు ఏపీ ప్ర‌భుత్వానికి ఇటు అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విచార‌ణ‌తో స్పీక‌ర్ గా కోడెల త‌న అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నార‌న్న విష‌యాన్ని తేట‌తెల్లం చేయ‌డ‌మే కాకుండా... త‌న‌కు అనుకూల వార్త‌లు రాయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తోన్న ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యంతో అధికార ప‌క్షం ఎంత‌లా ల‌బ్ధి చేకూరుస్తుందోన‌న్న విష‌యాన్ని ఆర్కే నిరూపించ‌బోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అంటే ఆర్కే ఒక్క దెబ్బకు రెండు పిట్ట‌లు ప‌డిపోతున్నాయ‌న్న‌మాట‌. చూద్దాం. ఏం జ‌రుగుతుందో?