Begin typing your search above and press return to search.

బాబు జైలుకెళ్ల‌డం ఖాయంః వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

By:  Tupaki Desk   |   5 July 2017 12:24 PM GMT
బాబు జైలుకెళ్ల‌డం ఖాయంః వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఐటీ మంత్రి లోకేష్ ల‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. జ‌యంతికి - వ‌ర్థంతికి తేడా తెలియ‌ని లోకేష్ ...త‌న‌ను విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. సదావ‌ర్తి భూముల కేసులో హైకోర్టు తీర్పున‌కు లోబ‌డి డ‌బ్బు చెల్లిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

డ‌బ్బులు క‌డితే ఐటీ రైడ్స్ చేయిస్తారా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన డ‌బ్బు ఎక్క‌డిదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే త‌న ఆస్తుల‌పై, చంద్ర‌బాబు - లోకేష్ ఆస్తుల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని స‌వాల్ విసిరారు. విచార‌ణ‌కు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, సీబీఐ విచార‌ణ‌లో ఎవ‌రెటువంటివారో తేలిపోతుంద‌ని చెప్పారు.

సదావర్తి సత్రం భూముల‌ను కారు చౌక‌గా కొంద‌రికి క‌ట్ట‌బెట్టిన టీడీపీ స‌ర్కార్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమ‌వారం తుది తీర్పునిచ్చింది. రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ.5కోట్లు చెల్లిస్తే ఆ భూములను రామకృష్ణారెడ్డికి కేటాయిస్తామని హైకోర్టు తెలిపింది.

చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 84 ఎకరాల స‌దావ‌ర్తి సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో స‌ర్కారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల ప్ర‌కార‌మే జరిగిందని సర్కారు పెద్దలు వాదించారు. వారి అక్ర‌మాల‌ను బయటపెట్టే కీల‌క‌మైన సాక్ష్యాన్ని‘సాక్షి’ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.

కోర్టు తీర్పు ప్రకారం రామకృష్ణారెడ్డి రూ. 5 కోట్లు అదనంగా చెల్లించి భూమి కొనాలని, ఒక‌వేళ‌ బినామీ పేర్లతో భూమి కొనుగోలు చేస్తే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని లోకేష్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆ విమ‌ర్శ‌ల‌కు రామకృష్ణారెడ్డి పై విధంగా స్పందించారు.