Begin typing your search above and press return to search.

పీవీ, జయ చేయని పనిని బాబు చేసేశారు

By:  Tupaki Desk   |   10 Dec 2016 7:02 AM GMT
పీవీ, జయ చేయని పనిని బాబు చేసేశారు
X
ఓటుకు నోటు కేసు విచారణపై మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణారెడ్డి తన పట్టు విడిచేది లేదని మరోమారు స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఈ కేసులో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయమేదీ లేదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ కేసులో తిరిగి తాను సుప్రీంకోర్టుకు వెళతానని ఆర్కే ప్రకటించారు. ఆడియో టేపుల్లో ఉన్నవి చంద్రబాబు గొంతేనని తాము శాస్త్రీయంగా నిరూపించినా కేసును కొట్టివేశారని, దీనిపై లోతాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

గతంలో తెరమీదకు వచ్చిన ఇలాంటి కేసుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, దివంగత సీఎం జయలలిత లాంటి చాలామంది పెద్దలు క్వాష్ పిటీషన్ దాఖలు చేయలేదని ఆర్కే గుర్తు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఆయన ఎందు కు క్వాష్ పిటీషన్ దాఖ లు చేశారని ప్రశ్నించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేసు దాఖలు చేయడానికి ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి లోకల్ స్టాండ్ లేదని కోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరైన కోర్టు దృష్టికి తీసుకువచ్చి ప్రైవేటు కేసు దాఖలు చేయవచ్చని, అవినీతి నిరోధక శాఖ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని, రెండేళ్ళ నుంచి ఈ కేసు విచారణ చేయకుండా పక్కనపెట్టారని, అందుకే తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరిగి తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సుధాకర్రెడ్డి వివరించారు.

ఇదిలాఉండగా న్యాయస్థానం తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. విశ్వసనీయత ఒక్క రోజులో వచ్చేది కాదని బాబు విశ్లేషించారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్న విషయాన్ని హైకోర్టు స్పష్టంచేసిందని ఆయన గుర్తుచేశారు. విపక్ష పార్టీలతో పాటు తనకు గిట్టని వారు ఇప్పటిదాకా వివిధ న్యాయస్థానాలలో 125 కేసులు నమోదు చేశారని, ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్ష పార్టీలతో పాటు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారు ఎంత చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఒరిగేదేమీ లేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు తాను జవాబుదారీగా ఉంటానని, వారు తనపై ఎంతో విశ్వాసం ఉంచి ఏపీలో అధికారాన్ని తనకు కట్టబెట్టారని గుర్తుచేశారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి సంక్షేమం, అభివృద్ధి కాంక్షిస్తానని చంద్రబాబు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తద్వారా బురదజల్లే ప్రయత్నం చేస్తే ఆ బురద వారికే అంటుకుంటున్నదని ఆ విషయాన్ని విపక్ష పార్టీలతో పాటు తనపై ఆరోపణలు చేసేవారు గుర్తుంచుకోవాలని చంద్రబాబు విశ్లేషించారు.