Begin typing your search above and press return to search.

అల్లం నారాయణకు మళ్లీ ‘బెల్లం’ ఇచ్చారు

By:  Tupaki Desk   |   14 July 2016 3:55 AM GMT
అల్లం నారాయణకు మళ్లీ ‘బెల్లం’ ఇచ్చారు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్ముకుంటే ఆ లెక్కే వేరు. అలా నమ్ముకున్నోళ్లు ఇప్పటికే అందుకు తగ్గ ఫలాలు రుచి చూశారు.. చూస్తున్నారు కూడా. నమ్మకంగా ఉంటూ.. విధేయులుగా వ్యవహరిస్తే నెత్తిన పెట్టుకొని చూస్తానన్న విషయాన్ని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు కూడా. నమ్మి తన దగ్గరకు వచ్చిన తుమ్మల మొదలెట్టి డీఎస్ వరకూ చూసినా ఎవరికి అన్యాయం జరిగిన దాఖలాలు కనిపించవు. ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణకు ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్ గా పదవిని ఇచ్చిన ఆయన తాజాగా మరో తోఫా ఇచ్చారు.

ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్ తో పాటు.. తన సొంత మీడియా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అల్లం నారాయణ విశేష కృషిని గుర్తించిన కేసీఆర్.. తాజాగా ఆయన ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్ గిరిని మరో మూడేళ్లు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఆయన్ను ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్ గా (2014 - జులైలో) నియమించారు. తాజాగా ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడికి క్యాబినెట్ హోదా లాంటి ఛైర్మన్ గిరిని పొడిగించటం ‘బెల్లం’ లాంటి ఆఫర్ కాకుండా ఉంటుందా ఏంటి? కొసమెరుపు ఏమిటంటే.. అల్లం నారాయణకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా పదవీ కాలాన్ని పొడిగించటాన్ని తెలంగాణ పాత్రికేయులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ఇతర నేతలు అభివర్ణించటం. ఇలాంటి గౌరవం.. మర్యాద ‘అల్లం’కు మాత్రమే దక్కుతుందని చెప్పక తప్పదు.