Begin typing your search above and press return to search.

ఈట‌ల‌పై భూకబ్జా ఆరోప‌ణ‌లు.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   30 April 2021 3:54 PM GMT
ఈట‌ల‌పై భూకబ్జా ఆరోప‌ణ‌లు.. కేసీఆర్ సంచలన నిర్ణయం!
X
తెలంగాణ వైద్యఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అసైన్డ్ భూముల‌ను క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని, ఈ మేర‌కు అధికారుల‌పైనా ఒత్తిడి తెచ్చార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మెద‌క్ జిల్లా మూసాయిపేట మండ‌లంలోని అచ్చంపేట‌, హ‌కీంపేట గ్రామాల ప‌రిధిలోని దాదాపు 100 ఎక‌రాల‌ను ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నించార‌ని ప‌లువ‌రు రైతులు రెవెన్యూ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈట‌ల రాజేంద‌ర్ కు చెందిన జ‌మున హ్యాచ‌రీస్ ప‌క్క‌న ఉన్న అసైన్డ్ భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని, ప్ర‌శ్నిస్తే బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని రైతులు ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే.. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ నాయ‌క‌త్వం మీద వ్య‌తిరేక స్వ‌రం వినిపిస్తున్నారు మంత్రి ఈట‌ల‌. ఇలాంటి స‌మ‌యంలోనే ఈ ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

మొత్తం 100 ఎక‌రాల భూమిని త‌మ‌కు రెగ్యుల‌రైజ్ చేయాల‌ని గ‌తంలో మంత్రి ఈట‌ల త‌మ‌పై ఒత్తిడి తెచ్చార‌ని ప‌లువురు రెవెన్యూ అధికారులు కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. అది సాధ్యం కాద‌ని, ఈ విష‌యంలో తామేమీ చేయ‌లేమ‌ని రెవెన్యూ అధికారులు చెప్పార‌ట‌. తాజాగా.. రైతుల ఫిర్యాదుతో ఈ విష‌యం ముఖ్య‌మంత్రికి వర‌కు వెళ్లింద‌ని తెలుస్తోంది.

ఈ విష‌యం తెలుసుకున్న సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీచేసిన‌ట్టుగా తెలుస్తోంది. క‌లెక్ట‌ర్ ద్వారా స‌మ‌గ్ర రిపోర్టు తెప్పించి ఇవ్వాల‌ని చెప్పార‌ట‌. ఇక‌, నిజానిజాల‌ను నిగ్గు తేల్చాల‌ని డీపీ పూర్ణ‌చంద్ర‌రావుకు సైతం ఆదేశాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. సాధ్య‌మైన‌త త్వ‌ర‌గా ప్రాథ‌మిక నివేదిక అందించాల‌ని చెప్పారట సీఎం.

ఇదిలాఉంటే.. టీఆర్ఎస్ అధిష్టానంతో ఈట‌ల రాజేంద‌ర్ చాలా కాలంగా అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు. చాలా కాలంగా ఈ వైరం కొన‌సాగుతోంద‌నే ప్ర‌చారం ఉంది. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈట‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని కేసీఆర్ అనుకున్నార‌నే ప్ర‌చారం కూడా సాగింది. కానీ.. అనివార్యంగా ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని చెబుతారు. తేడా ఎక్క‌డ వ‌చ్చిందో తెలియ‌దుగానీ.. టీఆర్ఎస్ కు తాము కిరాయిదారులం కాద‌ని, తామే అస‌లైన ఓన‌ర్లం అని ఈట‌ల గ‌తంలో వ్యాఖ్యానించారు. అప్ప‌టి నుంచి ప‌లు వేదిక‌ల‌పై టీఆర్ఎస్ అధిష్టానం మీద ప‌రోక్షంగా నిర‌స‌న స్వ‌రం వినిపిస్తూనే ఉన్నారు ఈట‌ల‌. ఇప్పుడు ఉన్న‌ట్టుండి భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి, ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుంది..? అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారు? సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది చూడాలి.