Begin typing your search above and press return to search.

బతుక‌మ్మ చీర‌ల్లో `చీప్` కుట్ర‌

By:  Tupaki Desk   |   18 Sept 2017 9:50 PM IST
బతుక‌మ్మ చీర‌ల్లో `చీప్` కుట్ర‌
X
బతుకమ్మ పండుగను మరింత సంబురంగా జరుపుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన చీరల పంపిణీ ప్ర‌క్రియ వివాదాస్ప‌దం మారింది. బతుకమ్మను ప్రతి పేద ఆడబిడ్డ సంతోషంగా చేసుకోవడంతోపాటు ఉపాధి లేక చితికిపోతున్న నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల కానుకకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీనికోసం రూ.222 కోట్ల ఖర్చుతో 1.04 కోట్లు చీరలను సిద్ధం చేసింది. ఈ మొత్తం చీరల్లో సగానికిపైగా రాష్ట్రం నుంచే సేకరించింది. రాష్ట్రంలోని మరమగ్గాల్లో అత్యధిక శాతం ఉన్న సిరిసిల్లలోనే 52 లక్షల చీరలు తయ్యారయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభించి 19 - 20 తేదీల్లో మొత్తం చీరలు పంపిణీ చేయ‌నున్నారు. ఈ పంపిణీ కార్య‌క్ర‌మానికి ఎంపీ క‌విత బాధ్య‌త వ‌హించారు. అయితే మొద‌టి రోజే ఈ ప్ర‌క్రియ కొన్నిచోట్ల‌ అబాసుపాల‌యింది. వివాదాల పాల‌యింది.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పలు చోట్ల రసాభాసగా మారింది. అడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక అంటూ సర్కార్ పంపిణీ చేస్తున్న చీరలు నాసిరకంగా ఉన్నాయని పలు జిల్లాలలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు - పెనుబల్లి మండలాలలో చీరల నాణ్యత పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మహిళలు వాటిని దగ్ధం చేసి బతుకమ్మ ఆడారు. అలాగే జగిత్యాల జిల్లాలో కూడా మహిళలు ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను దగ్ధం చేశారు. నాణ్యమైన చేనేత చీరలు ఇవ్వాలనీ - వంద - రెండు వందల రూపాయలు విలువ చేసే నాసిరకం చీరలు తీసుకోవడం తమకు అవమానమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్ర‌క్రియ‌ను చాలా మంది మ‌హిళ‌లు స్వాగతించిన‌ప్ప‌టికీ ఇందులో నాసిర‌కం చీర‌లు పంపిణీ చేయ‌డంపైనే మ‌హిళ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రూ.500 చీర‌లని చెప్పి రూ. 50 - వంద కూడా విలువ చేయ‌ని వాటిని త‌మ‌కు అంట‌గ‌ట్టార‌ని ప‌లువురు మండిప‌డ్డారు. చీర‌ల‌ను కాల్చిన మ‌హిళలు సైతం ఇదే ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ‌కు చీర‌లు ఇవ్వ‌క‌పోయినా బాగుండేద‌ని కానీ ఇచ్చి ఈ ర‌కంగా చిన్న‌బుచ్చ‌డం ఎందుకని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు చీరలను తగులబెట్టి ఘటనలో జగిత్యాల జిల్లా పరిధిలో గల చంచల్‌ గూడలో ఆరుగురిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చల్‌ గల్‌ సర్పంచ్‌ భర్త రాజేందర్‌ - ఎంపీటీసీ భర్త పెద్దలు సహా మరో నలుగురు ఉన్నారు. అయితే వీరిపై బతుకమ్మ చీరలు తగులపెట్టేలా మహిళలను ప్రోత్సహించారని కేసు నమోదైంది. దీంతో పోలీస్టేషన్‌ వద్దకు కాంగ్రెస్‌ వర్గీయులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.