Begin typing your search above and press return to search.

పుష్కరాల అవినీతిపై నేషనల్ మీడియా వాచ్

By:  Tupaki Desk   |   7 July 2016 10:09 AM GMT
పుష్కరాల అవినీతిపై నేషనల్ మీడియా వాచ్
X
కృష్ణానదిలో వరద ఎంతుందో తెలియదు కానీ.. కృష్ణా పుష్కరాల పనుల్లో మాత్రం అవినీతి వరద పోటెత్తుతోందట. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాసే సాహసం తెలుగు పేపర్లేవీ చేయకపోయినా ఆంగ్ల పత్రికలు మాత్రం చూసీచూడనట్లు వదిలేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిపై అడపాదడపా కథనాలు రాస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా పుష్కరాల పనుల్లో అవినీతిపై ఓ ఆంగ్ల పత్రిక భారీ స్టోరీ వేసింది. టీడీపీ నేతలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో బయటపెట్టింది.

మామూలుగా అయితే రూ.5 లక్షల లోపు పనులనే నామినేషన్ పై డైరెక్టుగా కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. 5 లక్షలకు మించిన పనులైతే టెండర్లు పిలవాల్సిందే. టెండర్లు పిలిస్తే టీడీపీ నేతలకే అవి దక్కుతాయని గ్యారంటీ ఏమీ లేదు. దాంతో టీడీపీ నేతలు కొత్త ఎత్తుగడ వేశారంటూ టైమ్సు ఆఫ్ ఇండియా పత్రిక ఆ అవినీతి వ్యవహారంపై కథనం ప్రచురించింది.

పుష్కరాల పనులను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయడం.. ప్రక్రియ ప్రారంభించకుండా సాగదీయడం వల్ల టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసే సమయం లేకుండా చేశారని.. సమయం లేదు కాబట్టి నామినేషన్ పై పనులు కేటాయిస్తున్నారని అసలు గుట్టు బయటపెట్టింది. కమీషన్లు తీసుకుని మంత్రులు - ఎమ్మెల్యేలు ఈ పనులను తమ అనుచరులకు ఇస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అంతేకాకుండా సమయం లేదన్న కారణంతో అంచనాలకు మించిన ధరలకు పనులు అప్పగిస్తున్నారని.. దీంతో పుష్కరాల పనులను 1500 కోట్లతో చేయాలని అనుకున్నా అంతకు రెట్టింపు ఖర్చు చేయడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.