Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రాజెక్టుకు న‌ర‌బ‌లి ఇచ్చారా?

By:  Tupaki Desk   |   1 July 2017 8:24 AM GMT
తెలంగాణ ప్రాజెక్టుకు న‌ర‌బ‌లి ఇచ్చారా?
X
న‌ర‌బ‌లి...ఈ చ‌ర్యే ఎంతో జుగుప్సాక‌రంగా ఉంటుంది. అనాగ‌రిక స‌మాజం నాటి రాక్ష‌స‌ చ‌ర్య ఇది. అలాంటి రాక్ష‌స‌ చ‌ర్యే తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ లో భాగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాలేశ్వ‌రం అనుబంధ రిజర్వాయర్‌ గా పేరొందిన కరీంనగర్ జిల్లా మేడారం సమీపంలోని చామన్‌ పల్లి పంప్‌ హౌస్ వద్ద నరబలి జరిగినట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని ధర్మారం - చామన్‌ పల్లి గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం అధారంగా ఈ వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ స‌మాచారం ప్ర‌కారం న‌ర‌బ‌లికి గురైన వ్య‌క్తి ఒడిశా వాసి అని తెలుస్తోంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేసేందుకు గాను ఒడిశాకు చెందిన ఓ కార్మికుడు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు వ‌చ్చాడు. ప‌నులు జ‌రుగుతున్న చామనపల్లి ప్రాంతం నుంచి ఆయ‌న ఏడాది క్రితం అదృశ్యమైనట్లు సమాచారం. ఒడిశాకు వెళ్ళినట్లు తొలుత భావించిన కుటుంబ సభ్యులు ఎంతకూ రాకపోవడంతో అదృశ్యం కింద ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల అందిన రహస్య సమాచారంతో పోలీసులు కేసును శోధించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్వహిస్తున్న కంపెనీ వ్యక్తులే నరబలి ఇచ్చినట్లు ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ దిశగా విచారణ నిర్వహించిన పోలీసులు కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కూపీ లాగినట్లు సమాచారం.

ఒడిశా కార్మికుడిని పంప్‌ హౌస్ వద్ద నరబలి ఇచ్చారన్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న నేప‌థ్యంలో చామన్‌ పల్లి డిసిపి - ఆర్‌ డిఒ - ఎసిపి ఆధ్వర్యంలో అధికారుల బృందం రానున్నట్లు, మృతదేహన్ని వెలికి తీసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఒక‌వేళ మృతదేహాన్ని వెలికి తీస్తే ఒడిశా కార్మికుడి నరబలి విషయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మ‌రోవైపు ఈ వార్త స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/