Begin typing your search above and press return to search.

అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపు కోసమే పవన్ ఇల్లు

By:  Tupaki Desk   |   14 March 2018 5:14 PM GMT
అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపు కోసమే పవన్ ఇల్లు
X
అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకోలేదు.. చంద్రబాబు కూడా అక్కడ సొంతిల్లు కట్టుకోలేదు. కానీ.. కొత్త పూజారి పవన్ కల్యాణ్ మాత్రం అక్కడ రెండెకరాల స్థలం కొని భారీ ఇల్లు కడుతున్నారు. దాంతో సహజంగానే అది చర్చనీయమవుతోంది. అంతేకాదు... ఈ ఇంటి విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఎకరాకు రూ.కోటికి తక్కువ లేదు. కానీ.. పవన్ కు మాత్రం ఎకరా రూ.20 లక్షల చొప్పున లింగమనేని ప్రయివేట్ లిమిటెడ్స్ వారు విక్రయించారు. పవన్ కు అమ్మిన రేటు... అమ్మిన సంస్థ పేరు బట్టి ఈ వ్యవహారంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లోనే ఉంటున్నారు. దీంతో చంద్రబాబు సహకారంతోనే పవన్ అక్కడ స్థలం తక్కువ ధరకు కొని ఇల్లు కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో కేవలం రూ.20 లక్షలకే ఎకరా దొరకడానికి కూడా కారణాలు చెప్తున్నారు. అమరావతి రాజధాని అయినప్పటికీ ఇంకా అక్కడ పెద్దగా జనాల్లేరు. కేవలం ఆఫీసులు మాత్రమే ఉంటున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్నంత ఊపు లేదు. దీంతో ఎవరైనా సెలబ్రిటీ అక్కడ ఇల్లు కట్టుకోవడం మార్కెట్ కు ఊపు తెస్తుందన్న ఉద్దేశంతో బడా రియల్టర్లు అయిన నేతలు కొందరు పవన్ కు అక్కడ తక్కువ ధరకు స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తున్నారన్న టాక్ కూడా ఉంది.

గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి సహకరించిన పవన్ ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా అదంతా నిజం కాదని రాజకీయాల్లో చాలా మంది నమ్ముతున్నారు. అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారం పవన్ చేస్తున్నారని.. టీడీపీ బలహీనంగా ఉన్నచోట జనసేన పోటీ చేసి చంద్రబాబుకు సహకరిస్తుందన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే తక్కువ ధరకు స్థలం.. అమరావతిలో ఇల్లు అన్న ఆరోపణలు వస్తున్నాయి.