Begin typing your search above and press return to search.

వ‌ణికిపోతోన్న టీడీపీ ఇన్‌చార్జ్‌లు.. ఎందుకంటే...?

By:  Tupaki Desk   |   14 Dec 2021 5:30 AM GMT
వ‌ణికిపోతోన్న టీడీపీ ఇన్‌చార్జ్‌లు.. ఎందుకంటే...?
X
2024 సాధారణ ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల టైం ఉంది. అయితే ఏపీలో మాత్రం ఇప్పుడే రాజకీయ వేడి రగులుకుంది. మరోవైపు జగన్ ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళతారనే ప్రచారం కూడా అటు అధికార పార్టీ నేతలతో పాటు... ఇఉ ప్రతిపక్ష పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఎవరికి వారు మరో ఐదారు నెలల్లో ఎన్నికలు ఉన్నాయ‌న్నట్టుగా జనాల్లో ఉంటున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దింపాలని... టిడిపితో పాటు మిగిలిన ప్రతిపక్షాలు బలంగా తీర్మానించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందు జనసేన - టిడిపి ఎలా అయితే కలిసి పని చేశాయో... వచ్చే ఎన్నికల్లో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు కూడా బయటకు వస్తున్నాయి.

ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి కీలక నేతల మధ్య ప్రాథమికమైన చర్చలు పూర్తయ్యాయని... అయితే సీట్ల పంపిణీ విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో... మరోసారి కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన 40 ఎమ్మెల్యే - ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే టిడిపి నుంచి 20 ఎమ్మెల్యే ... ఐదు ఎంపీ సీట్లు ఇస్తామన్న‌ ప్రతిపాదన వచ్చిందట.

జనసేన నేతలు ఒప్పుకోకపోవడంతో... కొద్ది రోజులు ఆగి మరోసారి కలిసి కూర్చోవాలని రెండు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే కాపు సామాజిక వర్గం... పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా ఉన్న ప్రాంతాల్లో టిడిపికి చాలా ప్లస్ అవుతుందన్న‌ అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన చోట రెండు పార్టీలకు మంచి ఫలితాలు వచ్చాయి.

ఇప్పుడు జనసేనతో పొత్తు ప్రచారం టిడిపి నేతలను ఉడికించేస్తోంది. జనసేన పోటీ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్న‌ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు తమ భవిష్యత్తు ఏంటా ? అని ఆందోళన చెందుతున్నారు.

జనసేనతో పాటు బిజెపి కూడా కలిసే ఛాన్స్ ఉంటే.. అది మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు, చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందే త‌ప్పా... తమ రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొడుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పార్టీ కోసం ప‌ని చేస్తున్నామ‌ని.. పొత్తులో కొన్ని సీట్లు జ‌న‌సేన‌కు ఇస్తే అక్క‌డ కేడ‌ర్ నాశనం అయిపోతుందని... చెల్లాచెదురు అయిపోతుందని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో జ‌నసేన‌, బీజేపీ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల‌కు టిక్కెట్లు ఉండ‌వు.

ముఖ్యంగా కృష్ణా - గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టిడిపి నేతల్లో టెన్షన్ మామూలుగా లేదు, రేపటి రోజున ఎక్కడ ? ఏ త్యాగం చేయాల్సి వస్తుందో ? అని వారు ఆందోళనతోనే ఉన్నారు.