Begin typing your search above and press return to search.

బాబుతో జ‌త క‌ట్టొద్దంటూ రాముల‌మ్మ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   25 Aug 2018 4:48 AM GMT
బాబుతో జ‌త క‌ట్టొద్దంటూ రాముల‌మ్మ వార్నింగ్‌!
X
తెలంగాణ‌లో ముంద‌స్తు హ‌డావుడి ఒక రేంజ్లో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రెన్ని అనుకున్నా.. ముంద‌స్తు విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌క్కా ప్లాన్ తో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గెలుపుపై ధీమాతో పాటు.. మీ గెలుపు బాధ్య‌త నాద‌న్న భ‌రోసాను ఇస్తున్న ఆయ‌న తీరు వ్యూహాత్మ‌కంగా ఉంటే.. కాంగ్రెస్ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో జ‌త క‌ట్టేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్న‌ట్లుగా కొంత‌కాలంగా చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఈ విష‌యంపై రెండు పార్టీల ముఖ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఏపీ సంగ‌తి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో బాబు పార్టీతో పొత్తు విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒకింత సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఫైర్ బ్రాండ్.. కాంగ్రెస్ మ‌హిళా నేత క‌మ్ సినీ న‌టి విజ‌య‌శాంతి మాత్రం టీడీపీ పొత్తు మాట‌ను పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీతో జ‌త క‌ట్ట‌టం స‌రికాద‌ని తేల్చి చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన నేప‌థ్యంలో.. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు అవ‌గాహ‌న కుదిరే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. రాముల‌మ్మ మాత్రం పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ అంశంపై పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. బాబుతో పొత్తు పెట్టుకుంటే పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌న్న వార్నింగ్‌ను విజ‌య‌శాంతి ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌టానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కార‌ణ‌మ‌ని.. అలాంట‌ప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మెద‌క్ జిల్లాకుచెందిన కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా పొత్తు ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు.. విజ‌య‌శాంతి అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం చావోరేవో అన్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకొన్న‌ కొంద‌రు పార్టీ నేత‌లు అధినాయ‌క‌త్వాన్ని త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారంటూ రాముల‌మ్మ మండిప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. పొత్తుపై రెండు పార్టీల నేత‌లు సానుకూలంగా స్పందిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా రాముల‌మ్మ మాత్రం తీవ్రంగా వ్య‌తిరేకించ‌ట‌మే కాదు.. పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ కు ఈ విష‌యంపై లేఖ రాస్తాన‌ని చెప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.