Begin typing your search above and press return to search.

కేసులెట్టినోళ్లనే అన్నా అనాల్సి వస్తుందే

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:15 AM GMT
కేసులెట్టినోళ్లనే అన్నా అనాల్సి వస్తుందే
X
‘టీ’ బ్యాచ్ కి పెద్ద కష్టమే వచ్చి పడింది. బీటీ బ్యాచ్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీ బ్యాచ్.. చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటోందట. తమ బాధలు అన్నీఇన్నీ కావని చెబుతున్న వారు.. ఇటీవల తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఎకరువు పెట్టేస్తున్నారు.

వస్తుందో.. రాదో తెలీని తెలంగాణ కోసం ఏళ్లకు ఏళ్లుగా పోరాడిన తాము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. తీరా తెలంగాణ వచ్చేస్తే.. అదికారం మొత్తం కొంతమంది చేతుల్లో ఉండిపోవటం.. వారి వద్దకు వెళ్లాలంటే మొహమాటంగా.. మహా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఉద్యమ సమయంలో ఎవరినైతే తిట్టేసి.. వారి దిష్టిబొమ్మలు కాల్చేసి.. వారి చేత కేసులు పెట్టించుకొని.. నేటికీ వాటి వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న తాము.. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా చిన్న సాయం కూడా చేయించుకోలేకపోతున్నామని వేదన చెందుతున్నారు.

సాధారణంగా కార్యకర్తలకు.. నేతలు పనులు చేసి పెడుతుంటారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయి.. కార్యకర్తలతోనే.. నేతలు పనులు చేయించుకుంటూ బండి లాగిస్తున్న దుస్థితి. ఇది ఏ ఒక్క జిల్లాలో కాకుండా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అదే పరిస్థితి నెలకొని ఉందని చెబుతున్నారు. పాత నీరు స్థానే.. కొత్త నీరు వచ్చినప్పుడు.. రెండు కలవటం కాస్త కష్టమైన పనే.

సరిగ్గా ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం తెలంగాణ అధికారపక్షంలో నెలకొంది. తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి పని చేసిన వారి నేతలకు ప్రాధాన్యత తగ్గి.. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం టీఆర్ ఎస్ పార్టీలోకి వచ్చిన నేతల్లో ఎక్కువ మంది హవా నడుస్తుండటంతో.. టీఆర్ ఎస్ అసలుసిసలు నేతలు నోట మాట రాని పరిస్థితి.

మొన్నటి వరకూ తిట్టినోళ్లే.. చక్రం తిప్పుతుంటే.. వారి వద్దకు వెళ్లి.. అన్నా.. బాగున్నావే అంటూ మాటలు కలపటం చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్.. నిజామాబాద్.. వరంగల్.. ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందని వారు వాపోతున్నారు. తమ గోడును పార్టీ అధినాయకత్వం పట్టించుకోవటం లేదని.. తమ బాధలు ఎవరికి చెప్పాలంటూ వారు వాపోతున్నారు. మొత్తానికి టీ బ్యాచ్ కి కాస్త పెద్ద కష్టమే వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.