Begin typing your search above and press return to search.

వారసులు ఎవరు బాబోయ్..

By:  Tupaki Desk   |   12 Aug 2015 12:10 PM GMT
వారసులు ఎవరు బాబోయ్..
X
నవ్యాంధ్ర రాజధాని భూముల్లోని కొన్ని ప్రాంతాల్లో వారసులను గుర్తించడం ప్రభుత్వానికి కష్టమైపోతోంది. వారికి కౌలు చెల్లింపు కానీ, పరిహారం చెల్లింపు కానీ సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా అమరావతి నగరానికి భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు కౌలు చెల్లింపులు చేసేందుకు సీఆర్ డీఏ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఇందుకు కారణం.. అసైన్డ్ భూములకు ఇద్దరు ముగ్గురు 9.3 భూ సమీకరణ పత్రాలను ఇవ్వడమే. రాజధాని గ్రామాల్లో 1800 ఎకరాల వరకు అసైన్డ్ భూమి ఉంది. అయితే, ఈ భూములకు ఒరిజినల్ అసైన్డ్ దారుల వారసులతోపాటు గతంలో ఆ భూములను కొనుగోలు చేసిన వాళ్లు కూడా 9.3 పత్రాలు అందజేశారు. దాంతో ఇప్పుడు కౌలు, పరిహారం ఎవరికి చెల్లించాలనే వివాదం జరుగుతోంది. అయితే, అసలు అసైన్డ్ దారులు, వారి వారసులకు తొలుత కౌలు చెక్కులు ఇస్తామని, ఆ తర్వాత భూములు ఎవరి అధీనంలో ఉంటే వారికే కౌలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఇక, మరికొంతమంది వారసత్వ వివాదంలో చిక్కుకున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజధాని గ్రామాల్లో ఇప్పుడు కుటుంబ కలహాలు తీవ్రం అయ్యాయి. తల్లి తండ్రి, కొడుకు, కూతురు, అత్త మామ.. ఇలా ఎవరనే తేడా ఏమీ లేదు. కుటుంబాల్లో వివాదాలు వస్తున్నాయి. ఇవన్నీ రోడ్డెక్కుతున్నాయి. ప్రభుత్వానికి కూడా చిక్కులు తీసుకొస్తున్నాయి. భూములు సమీకరణకు ఇచ్చిన తర్వాత.. భూ సమీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత.. ఇప్పుడు పరిహారం తమకు కావాలంటే తమకు కావాలని పేచీలు పెడుతున్నారు. దాంతో ఈ వివాదాలను తేల్చడానికే అధికారులకు సమయం సరిపోవడం లేదు.

డబ్బులు వస్తే.. సంపద పెరిగితే.. బాంధవ్యాలు తగ్గుతాయి. వివాదాలు పెరుగుతాయి. ప్రశాంతత తగ్గుతుందని అంటారు. రాజధాని గ్రామాల్లో ఇప్పుడు ఇది నిజమవుతోంది.