Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్లో క‌ల‌క‌లం.. 30 మంది ఎంపీల‌కు క‌రోనా

By:  Tupaki Desk   |   14 Sep 2020 6:10 PM GMT
పార్ల‌మెంట్లో క‌ల‌క‌లం.. 30 మంది ఎంపీల‌కు క‌రోనా
X
అక్క‌డ ఆ ఎమ్మెల్యేకు క‌రోనా వ‌చ్చింది. ఇక్క‌డ ఈ మంత్రి క‌రోనా బారిన ప‌డ్డాడు. మ‌రో చోట ఆ ఎంపీకు క‌రోనా సోకింది అని చెప్పుకుంటూ ఉన్నాం ఇప్ప‌టిదాకా. కానీ ఒకే రోజు 30 మంది ఎంపీలు క‌రోనా బాధితులుగా తేల‌డం ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. చాన్నాళ్ల విరామం త‌ర్వాత సోమ‌వార‌మే పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధం చేయ‌గా.. స‌మావేశాల‌కు ముందు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఏకంగా 30 మంది ఎంపీలు వైర‌స్ బాధితులుగా తేల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

స‌మావేశాలు ప్రారంభం కావ‌డానికి రెండు రోజుల ముందేపార్లమెంట్‌ ఆవరణలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయించగా.. సోమ‌వారం ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు క‌లిపి 30 మందికి క‌రోనా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. దీంతో పాటు పార్ల‌మెంటు సిబ్బంది, మీడియా వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 50 మందికి పైగానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన లోక్‌సభ సభ్యుల్లో వారిలో అధికార భాజపాకు చెందిన వారు 15 మంది దాకా ఉండ‌గా.. వైకాపాకు చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ చొప్పున ఉన్నట్లు చెబుతున్నారు. వైకాపాకు చెందిన అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప క‌రోనా బాధితులుగా తేలిన‌ట్లు స‌మాచారం.