Begin typing your search above and press return to search.

హిమాన్షుకు ప‌ద‌విచ్చి.. ఆ ప‌నులు చేయించాల‌ట‌

By:  Tupaki Desk   |   11 April 2017 9:25 AM GMT
హిమాన్షుకు ప‌ద‌విచ్చి.. ఆ ప‌నులు చేయించాల‌ట‌
X
పెద్ద పాల కుండ‌లోనూ చిటికెడు ఉప్పు.. అన్నిపాల‌ను విరిగిపోయేలా చేస్తుంది. ఎంత బాగా పాలించినా.. త‌ప్పులేం లేకుండా చూసుకోవ‌టం మంచిది. ఆ మాట‌కు వ‌స్తే.. మంచి చేయ‌కున్నా ఫ‌ర్లేదు.. అంద‌రికి త‌ప్పు అనిపించే ప‌నులు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం పాల‌కుల్లో ఉంటుంది. లేకుంటే.. లేనిపోని స‌మ‌స్య‌లు మీద‌కు కొని తెచ్చుకున్న‌ట్లే అవుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌మ‌డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు..రాజ‌కీయంగా ప‌లువురు త‌ప్పు ప‌ట్టిన ప‌రిస్థితి.

శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాద్రి రాముడికి ప‌ట్టువ‌స్త్రాల్ని.. మంచి ముత్యాల్ని స‌మ‌ర్పించిన వైనంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌తి ఏటా ముత్యాలు.. ప‌ట్టువ‌స్త్రాలు స్వామివారికి అప్ప‌గించే ప‌నిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి కానీ.. లేదంటే.. ప్రోటోకాల్ ప్ర‌కారం ఆయ‌న త‌ర్వాత వారు కానీ చేస్తుంటారు. కానీ.. ఈసారీ అలాంటిది జ‌ర‌గ‌లేద‌న్న విమ‌ర్శ తీవ్రంగా వినిపిస్తోంది.

అనారోగ్య కార‌ణంగా న‌వ‌మి వేడుక‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌ద్రాచ‌లానికి రాలేదు. దీంతో.. ఆయ‌న తీసుకురావాల్సిన ప‌ట్టువ‌స్త్రాలు.. ముత్యాల త‌లంబ్రాల్ని.. ఆయ‌న స్థానే దేవాదాయ శాఖామంత్రి తీసుకొచ్చారు. కాక‌పోతే.. జ‌రిగిందేమంటే.. మంత్రి వెంట‌.. కేసీఆర్ మ‌న‌మ‌డు హిమాన్షు ఉండ‌టం.. ఆయ‌న కూడా ప‌ట్టువ‌స్త్రాల్ని తీసుకు వ‌చ్చారు. అదేమంటే.. దేవాదాయ శాఖామంత్రి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టువ‌స్త్రాలు తీసుకొస్తే.. హిమాన్షు మాత్రం.. కేసీఆర్ కుటుంబం త‌ర‌ఫున స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాల్ని స‌మ‌ర్పించిన‌ట్లుగా చెప్పారు. ఈ వ్య‌వ‌హారం విప‌క్షాల‌తో పాటు.. ప‌లువురికి అస్స‌లు న‌చ్చ‌లేదు. ఏ హోదాతో త‌న మ‌న‌మ‌డి చేత ప‌ట్టువ‌స్త్రాలు తెప్పిస్తార‌న్న ప్ర‌శ్న‌ను కొంద‌రు లేవ‌నెత్తారు.

అయితే.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు కేసీఆర్ అండ్ కో చెప్పే మాటేమిటంటే.. హిమాన్షు కేసీఆర్ కుటుంబం త‌ర‌ఫు మాత్ర‌మే స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన‌ట్లుగా క్లారిటీ ఇస్తున్నారు. అయితే.. ఈ మాట‌కు ఎవ‌రూ క‌న్వీన్స్ కాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. హిమాన్షు చేత ముత్యాల త‌లంబ్రాల్ని అంద‌జేశార‌ని.. ఇదెలా చేస్తారంటూ ప్ర‌శ్నించే వారు తెర‌పైకి వ‌స్తున్నారు.

ఇలాంటి వేళ‌.. తాజాగా హైకోర్టు జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ అధ్య‌క్షులు రావుల చెన్నారెడ్డి తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సీఎం హోదాలో ఉన‌న వ్య‌క్తి స్థానంలో అత‌ని మ‌న‌మ‌డు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు.
ముక్క‌ప‌చ్చ‌లార‌ని కేటీఆర్‌ కొడుకుతో ప‌ట్టువ‌స్త్రాలు పంప‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని నిల‌దీశారు. అవ‌స‌రం అనుకుంటే.. కేసీఆర్ మ‌న‌మ‌డికి కూడా ఒక ప‌ద‌వి కేటాయించి.. ఆ త‌ర్వాత ఇలాంటి ప‌నులు చేయించుకోవాల‌ని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా.. ఏ ఒక్క మంత్రికి పూర్తి స్థాయి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేద‌ని.. అలాంట‌ప్పుడు వారికి ప‌ద‌వులు ఎందుకు? అని క్వ‌శ్చ‌న్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంతా పోరాడితేనే తెలంగాణ‌రాష్ట్రం వ‌చ్చిందే త‌ప్పించి.. కేసీఆర్ ఒక్క‌డి వ‌ల్ల కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. ప‌వ‌ర్ లో ఉన్న వేళ‌.. ఇలాంటి మాట‌లు వినిపిస్తాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/