Begin typing your search above and press return to search.

రాయలసీమకు హైకోర్టా? రాజధానా?

By:  Tupaki Desk   |   16 Oct 2019 9:22 AM GMT
రాయలసీమకు హైకోర్టా? రాజధానా?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేసిన నాటి పాలకులు పెద్ద తప్పు చేశారని రాష్ట్ర విభజన వేళ అందరికీ అర్థమైంది. సంపన్న హైదరాబాద్ తెలంగాణకు దక్కి మిగులు బడ్జెట్ లోకి వెళ్లిపోగా.. రాజధాని కూడా లేని ఏపీ అన్యాయమైపోయిందన్న ఆవేదన అందరి నోటా వినిపించింది.

ఇప్పుడూ అదే కథ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని అంతా రాజధాని అమరావతికే పరిమితం చేశారన్న విమర్శలున్నాయి. అయితే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణకు సిద్ధమైంది. హైకోర్టు రాయలసీమకు, రాజధాని విజయవాడకు, పారిశ్రామిక కారిడార్ విశాఖకు ఇవ్వడానికి ప్లాన్ చేసింది.

అయితే హైకోర్టు తరలింపు ఏపీలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. రాయలసీమకు హైకోర్టును తరలించడాన్ని నిరసిస్తూ కోస్తా న్యాయవాదులు అమరావతిలో విధులు బహిష్కరించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు..

దీంతో భగ్గుమన్న రాయలసీమ లాయర్లు తాజాగా భారీ సంఖ్యలో సచివాలయానికి తరిలివచ్చారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా నిరసనలు చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శనలతో నినాదాలతో హోరెత్తించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అన్నీ వ్యవస్థలను అమరావతిలోనే పెట్టిందని.. ధ్వజమెత్తారు..

హైకోర్టు ఒకవేళ కోస్తాలోనే పెడితే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని సీమ లాయర్లు తాజాగా డిమాండ్ మొదలు పెట్టారు. సీఎం జగన్ ను కలిసేవరకు సెక్రెటేయట్ వదిలేది లేదని అమరావతిలో భీష్మించుకు కూర్చున్నారు. వీరి నిరసన ఇప్పుడు ఏపీలో మరో ఉద్యమానికి... ఉద్రిక్తతకు దారితీసేలా కనిపిస్తోంది