Begin typing your search above and press return to search.

వైసీపీలో మంత్రులంద‌రూ దాదాపు కాంగ్రెస్‌, టీడీపీ వల్ల‌నే

By:  Tupaki Desk   |   13 April 2022 11:30 AM GMT
వైసీపీలో మంత్రులంద‌రూ దాదాపు కాంగ్రెస్‌, టీడీపీ వల్ల‌నే
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైసీపీలో మంత్రివ‌ర్గ హ‌డావుడి త‌గ్గింది. ఇన్ని రోజులుగా ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది? ఎవ‌రి ప‌ద‌వి ఊడుతుంది? అంటూ చ‌ర్చ‌లు సాగాయి. కానీ ఇప్పుడు జ‌గ‌న్ మంత్రివ‌ర్గ విస్త‌రణ పూర్త‌వ‌డం.. వాళ్ల‌కు శాఖ‌ల కేటాయింపు కూడా జ‌రిగిపోవ‌డంతో ఇక చ‌ర్చ ముగిసింది. సీఎం జ‌గ‌న్ అనూహ్యంగా 11 మంది మంత్రుల‌ను కొన‌సాగించి.. కొత్త‌గా 14 మంది అవ‌కాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మంత్రుల్లో దాదాపు అంద‌రూ కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లే అని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్‌, టీడీపీ నేత‌లే ఇప్పుడు జ‌గ‌న్ కేబినేట్లో మంత్రులుగా ప‌ద‌వులు అనుభ‌విస్తున్నార‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేసింది.

త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణంతో జ‌గ‌న్ కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌తో విభేదాల కార‌ణంగా జ‌గ‌న్ వైసీపీ పార్టీ పేరుతో కొత్త కుంప‌టి పెట్టుకున్నారు. అప్పుడు జ‌గ‌న్‌తో స‌హా పార్టీ కీల‌క నేత‌లు కొత్త నాయ‌కుల‌ను త‌యారు చేస్తామ‌ని గొప్ప‌గా చెప్పార‌ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పార్టీలో దాదాపు అంద‌రూ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లే ఉన్నారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు కొత్త నాయ‌కుల‌తో ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు వ‌చ్చామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ అధికారాన్ని ద‌క్కించుకోలేక‌పోయారు. ఆ త‌ర్వాత పార్టీలోకి జంపింగ్‌లో ఎక్కువ‌య్యాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిక‌లు తార‌స్థాయికి చేరాయి. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన జంప్ జిలానీ నేత‌ల‌కు జ‌గ‌న్ టికెట్లు కేటాయించారు. జ‌గ‌న్ పేరుతో ఆ నేత‌లంతా గెలిచారు. ఇప్పుడు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.

పార్టీలో చ‌దువుకున్న వాళ్లు.. వైసీపీనే న‌మ్ముకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వాళ్లూ ఉన్నారు. కానీ సామాజిక స‌మీక‌ర‌ణాల కార‌ణంగా జ‌గ‌న్ వాళ్ల‌ను కేబినేట్లోకి తీసుకోలేద‌ని టాక్‌. కొత్త నాయ‌కుల‌కు అందుకే మొండిచెయ్యి చూపించార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సామాజిక స‌మీక‌ర‌ణాలే కీల‌కంగా జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకే ఒక‌ప్ప‌టి కాంగ్రెస్‌, టీడీపీ నేత‌ల‌కు కేబినేట్లో చోటు ద‌క్కింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌లు ఎక్కువ సంఖ్య‌లో మంత్రులయ్యార‌ని అంటున్నారు.

ఒక‌సారి మంత్రుల జాబితా ప‌రిశీలిస్తే అదే నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. విడుద‌ల ర‌జ‌నీ, ఆర్కే రోజా, జ‌య‌రామ్‌, వ‌నిత‌, బుగ్గ‌న లాంటి నేత‌లంతా ఒక‌ప్పుడు టీడీపీ అధినేత బాబు నేతృత్వంలో టీడీపీలో ఉన్న‌వాళ్లే. ఇక బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి నేత‌లు ఒక‌ప్ప‌టి హార్డ్‌కోర్ కాంగ్రెస్ నేత‌ల‌న్న సంగ‌తి తెలిసిందే.

ఇలా మంత్రివ‌ర్గంలో దాదాపు వాళ్లే ఉన్నారు. దీంతో జ‌గ‌న్ సొంత ఫ్యాక్ట‌రీ నుంచి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకునే నేత‌లే లేకుండా పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టి ఇన్నేళ్లు అయిన‌ప్పటికీ వైసీపీ సొంత నేత‌లు బ‌లంగా ఎద‌గ‌లేక‌పోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.