Begin typing your search above and press return to search.

సోనియా పంజాబ్ ఆశలు పాయే..

By:  Tupaki Desk   |   27 Jun 2016 7:26 AM GMT
సోనియా పంజాబ్ ఆశలు పాయే..
X
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బుల్లి ఇలాకా పాండిచ్చేరి మినహా మిగతా ఎక్కడా అధికారం అన్నది దక్కకపోవడం.. అంతకుముందు 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా చితికిపోయిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరోభారీ షాక్ తగిలింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో ఏదో సాధించాలని తెగ తాపత్రయపడుతున్న తరుణంలో ఆ రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్ నేత - మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో సోనియా షాక్ తిన్నారు. ఇప్పటికే సోనియాకు - రాహుల్ కు విషయం చేరవేసిన ఆయన తాజాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.

కాంగ్రెస్ పార్టీని వీడుతున్న కెప్టెన్ వేరే ఏ పార్టీలో చేరబోవడం లేదు. సొంతంగా పార్టీ పెట్టేందుకు ఆయన రెడీ అవుతున్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్ ను వీడడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. పంజాబ్ లోని ప్రస్తుత అకాళీదల్ ప్రభుత్వం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ వస్తున్న నేపథ్యంలో తనకు మరింత స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరగా అందుకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందనే కారణంతో వెళ్లిపోతున్నట్లు ఆయన పరోక్షంగా చెప్పారు.

అయితే.. సొంత పార్టీ పెట్టడం లాభధాయకమన్న ఆలోచనతోనూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అకాళీదళ్ తో పాటు ఆప్ కూడా సమాన అవకాశాలు కలిగి ఉండడం.. కాంగ్రెస్ వాటితో పోటీపడడం కష్టం కానున్న నేపథ్యంలో అక్కడ బహుముఖ పోటీ తప్పదని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో పార్టీ పెడితే తన ఇమేజి వల్ల కొన్ని సీట్లు వస్తాయని.. ముఖ్యమంత్రి స్థానం కోసం తమ మద్దతు కీలకమవుతుందన్న అంచనాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లోనే ఉంటే పార్టీ గెలుపు కష్టం కావడం ఒకటైతే.. ఒకవేళ గెలిచినా కూడా తనకు సీఎం అవకాశం ఇస్తారన్నది అనుమానమే కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా బలమైన నేత అయిన అమరీందర్ బయటకు వెళ్తుండడం కాంగ్రెస్ మాత్రం గట్టి ఎదురుదెబ్బే.