Begin typing your search above and press return to search.

మోదీకి సీబీఐ చీఫ్ రిట‌ర్న్ షాక్‌!

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:24 AM GMT
మోదీకి సీబీఐ చీఫ్ రిట‌ర్న్ షాక్‌!
X
మ‌న‌దేశంలోని అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల్లో సీబీఐ ఒక‌టి. కీల‌క కేసుల్లో రాష్ట్రాల్లోని పోలీసుల ద‌ర్యాప్తుతో స‌రిగ్గా న్యాయం జ‌ర‌గ‌దేమోన‌ని సందేహాలు త‌లెత్తితే అంద‌రి చూపులు ఆ సంస్థ‌వైపే మ‌ళ్లుతాయి. అలాంటి సీబీఐలో ఉన్న‌తాధికారుల అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఇటీవ‌ల ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. సంస్థ ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చేలా మారాయి. చివ‌ర‌కు సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం ద్వారా ప్ర‌దాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలోని అత్యున్న‌త స్థాయి నియామ‌కాల క‌మిటీ అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు తెర‌దించింది.

అయితే - ఈ వ్య‌వ‌హారం అంత‌టితో ముగిసిపోలేదు. ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం ద్వారా త‌న‌కు షాకిచ్చిన ప్ర‌ధాని మోదీకి అలోక్ వ‌ర్మ రిట‌ర్న్ షాక్ ఇచ్చారు. క‌నీసం త‌న వాద‌న వినకుండానే వేటు వేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. స‌హ‌జ న్యాయసూత్రాల‌ను ప్ర‌ధాని విస్మ‌రించారంటూ విమ‌ర్శించారు. అవినీతి ఆరోప‌ణ‌ల కేసులో ఇరుక్కొని ద‌ర్యాప్తు ఎదుర్కొంటున్న సీబీఐ ప్ర‌త్యేక డైరెక్ట‌ర్ రాకేశ్ అస్థానా చేసిన ఫిర్యాదు ఆధారంగా త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని ఆక్షేపించారు.

సీబీఐ చీఫ్ ప‌దవి నుంచి త‌ప్పించిన అనంత‌రం ప్ర‌భుత్వం అలోక్ వ‌ర్మ‌ను ఫైర్ స‌ర్వీస్‌ - సివిల్ డిఫెన్స్‌ - హోంగార్డుల శాఖ డైరెక్ట‌ర్‌ గా ప్ర‌భుత్వం నియ‌మించింది. అయితే - ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు అలోక్ నిరాక‌రించారు. ప్ర‌భుత్వ భిక్ష త‌న‌కు అక్క‌ర్లేద‌న్న‌ట్లుగా ఆ ప‌ద‌విని తిర‌స్క‌రించారు. తాను ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌ట్లు ప‌రిగ‌ణించాల‌ని కోరారు. త‌ద్వారా త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించిన మోదీకి రిట‌ర్న్ షాక్ ఇచ్చారు.

ఆలోక్ వ‌ర్మ 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అరుణాచల్‌ ప్రదేశ్‌-గోవా-మిజోరాం కేంద్ర పాలిత ప్రాంత (ఏజీఎంయూటీ) క్యాడర్ కు చెందిన‌వారు. వాస్త‌వానికి 2017 జులై 31లో ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాలి. అంత‌కుముందే అదే ఏడాది జ‌న‌వ‌రిలో సీబీఐ చీఫ్‌గా విధుల్లో చేరారు. సీబీఐ చీఫ్ ప‌ద‌వీకాలం రెండేళ్లు ఫిక్స్ గా ఉంటుంది. దీంతో ఆయ‌న స‌ర్వీస్ ను పొడిగించారు. ఈ నెల 31న అలోక్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆ ప‌ద‌విని కోల్పోయిన నేప‌థ్యంలో తాను వెంట‌నే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ట్లు ప‌రిగ‌ణించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆయ‌న కోరారు.