Begin typing your search above and press return to search.

ప్రొటోకాల్ పోరు : జగన్ పేరు పక్కన రఘురామ... ఆ కిక్కే వేరబ్బా ...

By:  Tupaki Desk   |   2 July 2022 9:39 AM GMT
ప్రొటోకాల్ పోరు :  జగన్ పేరు పక్కన రఘురామ... ఆ కిక్కే వేరబ్బా ...
X
అన్ని సమస్యలూ ఆయనకే వస్తున్నాయి. సాఫీగా సవ్యంగా సాగాల్సిన ప్రతీ చిన్న విషయంలోనూ ఆయనకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతీ దానికీ కోర్టు తలుపులనో కేంద్రం తలుపులనో ఆయన సడెన్ గా తట్టాల్సి వస్తోంది. ఆయనే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన మనసు భీమవరంలో ఉంది. మనిషి ఢిల్లీలో ఉన్నారు. ఇక కొద్ది గంటలలో రాజు గారు భీమవరంలో ల్యాండ్ అవుతారు. ఈ నెల 4న భీమవరంలో ప్రధాని మోడీతో కలసి అల్లూరి 125వ జయంతిలో ఆయన పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా తనను ఏపీ సర్కార్ ఇబ్బంది పెట్టకుండా న్యాయ రక్షణను ఆయన పొందారు. తన మీద కేసులు పెట్టిన తరువాతనే అరెస్ట్ చేయాలి తప్ప వెంటనే అరెస్ట్ అంటే కుదరదు అని కోర్టు ద్వారా వచ్చిన తీర్పుతో రాజు గారిలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే రాజు గారిలో ఇపుడు మరో కొత్త బెంగ చోటుచేసుకుంది.

ప్రోటోకాల్ ప్రకారం తాను లోకల్ ఎంపీ. ప్రధాని చేసే ప్రారంభోత్సవాలలో శిలాఫలకం మీద తన పేరు కచ్చితంగా ఉండాలి. ముందు ప్రధాని, తరువాత సీఎం పేర్లు ఉంటే మంత్రులతో పాటు నర్సాపురం ఎంపీగా రఘురామ పేరు కూడా శిలాఫలకం మీద మెరవాలి. సరిగ్గా ఇక్కడే రాజు గారికి డౌట్ గట్టిగా కొడుతోంది.

శిలాఫలకం మీద తన పేరు లేకుండా చేసేందుకు చూసేందుకు ఏపీ సర్కార్ శతవిధాల ప్రయత్నం చేస్తోందని సమాచారం అందడంతో ఆయన మళ్లీ కేంద్రం తలుపు తట్టారు. పర్యాటక సాంస్కృతీక శాఖకు లేఖ కూడా రాసారు. లోకల్ ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం తన పేరు కచ్చితంగా ఉండాలని ఆయన అందులో పేర్కొన్నారు. ఇది తనకు ఉన్న హక్కు అన్నట్లుగా ఆయన చెప్పుకున్నారు.

ఈ విషయంలో ఏపీ సర్కార్ నుంచి వత్తిడులు ఏమైనా వచ్చినా కూడా తలొగ్గవద్దని ఆయన కోరుతున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ, సీఎం జగన్ తో పాటు రఘురామ పేరు కూడా శిలాఫలకం మీద ఉంటే చూసేవారికి ఆ కిక్కే వేరు కదా. మరి జగన్ సర్కార్ అక్కడ ఉంది. రఘురామ పేరు చదవడానికే చికాకు పడుతున్న ఏపీ పెద్దలకు జగన్ పక్కన ఆయన పేరు ఉంటే మనసొప్పుతుందా.

మొత్తానికి రఘురామ ఇటు అటు జగన్ సర్కార్, మధ్యన పడి కేంద్ర పర్యాటక శాఖ నలగడం ఖాయం. అయినా దేశం మొత్తం రాజకీయ చరిత్రలో ఇలాంటి వైరాలు, వైనాలు కేంద్రం ఎపుడూ చూసి ఉండదేమో. ఎంతైనా ఏపీలో ఉన్నది రఘురామ వర్సెస్ జగన్ కదా. ఇక్కడ ఇట్టాగే ఉంటుంది మరి.