Begin typing your search above and press return to search.

ఆధార్‌ ను వ్యతిరేకిస్తారు..వీసా కోసమైతే బట్టలిప్పుతారు

By:  Tupaki Desk   |   26 March 2018 5:01 AM GMT
ఆధార్‌ ను వ్యతిరేకిస్తారు..వీసా కోసమైతే బట్టలిప్పుతారు
X
ఆధార్‌ను తప్పుబడుతున్న వారిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఐటీశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ తీవ్ర విమర్శలు చేశారు. ఆధార్ వివరాలు లీక్ అయ్యాయని ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. ప్రధానమంత్రి ప్రజల వివరాలను అమెరికన్ కంపెనీలకు ఇస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు ఆల్ఫోన్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కట్టుకథలను ఎవరైనా నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. డాటా భద్రత గురించి మాట్లాడేవారు అమెరికా వీసా కోసం తెల్లోని ముందు నగ్నంగా నిలబడేందుకు వెనుకాడరని - అదే సొంత ప్రభుత్వం కొన్ని వివరాలు అడిగితే మాత్రం ఉద్యమాలకు పిలుపునిస్తారని విరుచుకుప‌డ్డారు.

`అమెరికా వీసా కోసం మనం పది పేజీల దరఖాస్తును పూర్తిచేస్తాం. తెల్లవాళ్లకు ఫింగర్‌ ప్రింట్స్ ఇవ్వడంతోపాటు పూర్తిగా బట్టలు విప్పి చూపేందుకు మనకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ సొంత ప్రభుత్వం కేవలం పేరు - చిరునామా వంటి వివరాలు అడిగితే ప్రైవేటు జీవితంలో చొరబాటు అంటూ గగ్గోలు పెడుతాం `అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వద్ద ప్రజల డాటా పూర్తి సురక్షితంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అసలు ఆధార్‌ లో ఏముంది? కేవలం పేరు - చిరునామా. మన బయోమెట్రిక్ వివరాలు యూఐడీఏఐ వద్ద ఉంటాయి. ఈ వివరాలు ఎప్పుడూ ఉల్లంఘనకు గురికావు. పూర్తి భద్రత ఉంటుంది. కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాటిని ఉపయోగించగలవు అని ఆయన వివరించారు.