Begin typing your search above and press return to search.

ఎంత మాట.. ఎంత మాట? కవితక్కను అంత మాట అంటారా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 10:20 AM GMT
ఎంత మాట.. ఎంత మాట? కవితక్కను అంత మాట అంటారా?
X
‘చెంపకు చేయి పరమైనప్పుడు కంటికి నీరు ఆదేశమగును’ అన్న మాటను తెలుగు నేర్చుకున్న వారంతా చిన్నప్పుడే నేర్చుకుంటారు. ఎంత ఈటల అయితే మాత్రం.. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తాము అమితంగా ఆభిమానించి.. అంతకు మించి ఆరాధించే శ్రీమాన్ కేసీఆర్ ను కానీ.. కవితక్కను కానీ అంటే ఊరుకుంటారా? నిన్నటికి నిన్న మంత్రి హరీశ్ రావు మండిపాటు గురించి తెలిసిందే. సమాధానం చెప్పుకోలేక.. మంత్రి ఈటల తన ప్రస్తావన తెస్తున్నారంటూ.. కేసీఆర్ పట్ల తమకున్న కమిట్ మెంట్ ను బల్లగుద్ది మరి చెప్పారు.

తన గంట ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇప్పటివరకు కవితపై పలువురు విమర్శలు చేసినా.. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లో ఉండి.. పెద్ద సారుకు సన్నిహితంగా ఉన్న ఏ ఒక్క నేత కూడా కవితపై విమర్శలతో విరుచుకుపడలేదు. ఇప్పుడా అనుభవం ఈటల ఎపిసోడ్ తో కేసీఆర్ ఫ్యామిలీకి ఎదురైంది. ఆ షాక్ నుంచి తేరుకోవటం కాస్త కష్టమే అయినా.. ఈటల ప్రెస్ మీట్ పెట్టిన రోజు తర్వాత నుంచి వరుస పెట్టి.. కవిత ఫాలోయర్స్ దుమ్ము దులిపేస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడితోపాటు.. కీలక నేతలు ఈటలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆలోచనకు తగ్గట్లు కరీంనగర్ లో తొలుత తాము ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని.. తర్వాత పది పాత జిల్లాలకు విస్తరించామన్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినంతనే తమ సంఘంపై అనవసరంగా ఆరోపణలు చేశారన్నారు. హుజురాబాద్ బరిలో నిలిచిన ఈటల రాజేందర్ కు తమ సంఘం వారు ఓట్లు వేయలేదా? అని ప్రశ్నించిన వారు..కవిత మేడం మీద అనవసరంగా ఆరోపణలు చేయటాన్ని తాము సహించమన్నారు.

అప్పట్లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాయిని నర్సింహారెడ్డిని.. కొప్పుల ఈశ్వర్ ను తమ అధ్యక్ష.. గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నామని.. తర్వాత నాయిని మంత్రి కావటం.. కొప్పుల విప్ కావటంతో ఎంపీ కవితను తమ గౌరవ అధ్యక్షురాలిగా నియమించుకున్నట్లుగా చెప్పారు. కవిత మేడం తమ సంఘ సమస్యల్ని తీర్చారని.. తమకు అండగా ఉన్నారన్నారు. తమపై ఈటల రాజేందర్ అనవసర వ్యాఖ్యలు చేయొద్దన్నారు. కవితక్కపై తప్పుడు ఆరోపణలు చేయటం మంచిది కాదని.. ఆయన చేసిన వ్యాఖ్యలన్ని పూర్తి అవాస్తవమన్నారు. నిజమే.. చూస్తూ.. చూస్తూ కవితక్కను మాటలు అనేస్తే.. ఊరుకుంటారా ఈటల?