Begin typing your search above and press return to search.

ఆమంచి - అవంతి!..ఇప్పుడు పండుల ర‌వీంద్ర‌!

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:29 AM GMT
ఆమంచి - అవంతి!..ఇప్పుడు పండుల ర‌వీంద్ర‌!
X
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీ దెబ్బ త‌గులుతోందనే చెప్పాలి. ఎక్క‌డైనా విప‌క్షాల్లో నుంచి అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు ఉండ‌టం స‌హ‌జ‌మే. అయితే ఇప్పుడు ఏపీలో ప‌రిస్థితి అందుకు రివ‌ర్స్‌ గా సాగుతోంది. 2014 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత విప‌క్షం వైసీపీ నుంచి అధికార పార్టీ టీడీపీలోకి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు చోటుచేసుకున్నాయి. విప‌క్షాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార పార్టీలు అనుస‌రిస్తున్న వ్యూహంలో భాగంగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు చాలా మంది వైసీపీ నేత‌లు లొంగిపోయారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎంపీల‌ను త‌న వైపున‌కు తిప్పేసుకున్న చంద్ర‌బాబు... విప‌క్షం వైసీపీని - ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని బాగానే వీక్ చేయాల‌ని య‌త్నించారు.

అయితే సంఖ్యాబ‌లం త‌గ్గినా కూడా వైసీపీ ఎక్క‌డ కూడా త‌గ్గిన‌ట్టుగా క‌నిపించ‌లేదు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీడీపీలో చేర్చుకోవ‌డంతో పాటుగా వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చిన చంద్ర‌బాబును చూసి... జ‌గ‌న్ ఏనాడూ బెదిరిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ఇదే త‌ర‌హా వైఖ‌రితోనే ముందుకు సాగిన వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విన్న‌ర్‌గానే నిలిచేందుకు త‌న‌వంతు య‌త్నాల‌ను కాస్తంత గ‌ట్టిగానే చేస్తోంద‌ని చెప్పాలి. ఈ య‌త్నాలు కూడా భారీగానే ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లుగా స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు మొద‌లైన‌ట్టుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో ఓ పార్టీ టికెట్ మీద గెలిచి... ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రో పార్టీలో చేర‌డం కంటే.. ఎన్నిక‌ల‌కు ముందే గెలిచే పార్టీలో చేరితే ఎలాగుంటుంద‌ని ఆలోచిస్తున్న నేత‌లు.. వైసీపీ బాట ప‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా త‌మకు స‌ముచిత స్థానం ల‌భించే పార్టీలోకి వెళ్లడ‌మే మంచిద‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన నేత‌లంతా ఇప్పుడు వైసీపీ బాట ప‌డుతున్నార‌న్న మాట వినిపిస్తోంది.

ఈ లెక్క‌న‌ నిన్న ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేసి జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఆమంచి వైసీపీలో చేరిక దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక నేటి ఉద‌యం విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు (అవంతి శ్రీ‌నివాస్‌) కూడా టీడీపీకి రాజీనామా చేశారు. నేటి సాయంత్రమో - రేపు ఉద‌య‌మో ఆయ‌న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ క్ర‌మంలో తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర బాబు కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త‌లు ఇప్పుడు మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. టీడీపీకి రాజీనామా చేయ‌నున్న పండుల... ఆమంచి, అవంతి బాట‌లోనే వైసీపీలో చేరే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ముంగిత ఈ త‌ర‌హా ప‌రిణామాలు టీడీపీకి పెద్ద దెబ్బేనన్న వాద‌న వినిపిస్తోంది.