Begin typing your search above and press return to search.

అయ్యో ఆమంచి.. రెంటికి చెడ్డ రేవ‌డే కానుందా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:49 AM GMT
అయ్యో ఆమంచి.. రెంటికి చెడ్డ రేవ‌డే కానుందా?
X
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణ‌యాల‌ను హైకోర్టు త‌ప్పుబ‌ట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నిర్ణ‌యాలు చెల్ల‌వ‌ని తీర్పు ఇచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ నేత‌లు రెచ్చిపోయారు. త‌మ‌కు 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌ని.. కోర్టులు చెప్తే తాము వినాలా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో న్యాయ‌మూర్తుల‌ను దూషిస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప‌లువురు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు.

న్యాయ‌మూర్తుల‌కు కులాల‌ను ఆపాదించ‌డం, దురుద్దేశాల‌ను అంట‌గ‌ట్ట‌డం వంటివి చేయ‌డంపై హైకోర్టు క‌న్నెర్ర చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సుమోటోగా తీసుకుని సీబీఐ విచార‌ణ‌కు అప్ప‌గించింది. దీంతో వైఎస్సార్సీపీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ముందుగా దొరికిపోయారు. న్యాయ‌మూర్తుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసినందుకుగానూ ఆయ‌న‌కు సీబీఐ ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసింది. ఆగ‌స్టు 6న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని సీబీఐ హైకోర్టుకు కూడా తెలియ‌జేసింది.

న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిలో మొత్తం 49 మంది ఉన్నారు. వీరంతా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా విభాగం ఇన్‌చార్జ్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నార‌ని అంటున్నారు. కాగా త‌న‌పై సీబీఐ పెట్టిన‌ ఈ కేసులను కొట్టివేయాలని ఆమంచి హైకోర్టును ఆశ్రయించినా ఫ‌లితం లేకుండా పోయింది.

మ‌రోవైపు ఇంతా చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల అసెంబ్లీ సీటు ఆమంచికి ద‌క్క‌ద‌ని తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఓట‌మిపాల‌య్యారు. ఆమంచిపై టీడీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాంకృష్ణ‌మూర్తి గెలుపొందారు. ఆ త‌ర్వాత క‌ర‌ణం బ‌ల‌రాం వైఎస్సార్సీపీకి చేరువ అయ్యారు. అంతేకాకుండా త‌న కుమారుడిని కూడా వైఎస్సార్సీపీలో చేర్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల సీటు క‌ర‌ణం బ‌ల‌రాంకేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశార‌ని అంటున్నారు. ఆమంచిని ప్ర‌కాశం జిల్లా (ప్ర‌స్తుతం బాప‌ట్ల జిల్లా) ప‌ర్చూరు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించార‌ని చెబుతున్నారు. అయితే ప‌ర్చూరు వెళ్ల‌డానికి ఆమంచి సిద్ధంగా లేర‌ని అంటున్నారు.

పోనీ పార్టీ మార‌దామా అంటే గ‌త ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచే ఆమంచి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలోకి వ‌చ్చే ముందు టీడీపీపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆ పార్టీలోకి దారులు మూసుకుపోయాయి. పోనీ జ‌న‌సేన పార్టీలోకి రావ‌డానికి కూడా ఇదే స‌మ‌స్య‌గా ఉంది. గ‌తంలో వైఎస్సార్సీపీ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అందులోనూ ప‌వ‌న్ ఇలాంటి జంపింగ్ జ‌పాంగుల‌ను చేర్చుకోన‌ని ఎప్పుడో తేల్చిచెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా ఉంద‌ని చెప్పుకుంటున్నారు.

మ‌రోవైపు సీబీఐ విచార‌ణ సంద‌ర్భంగా ఆమంచిని అరెస్టు చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న ఆగ‌స్టు 6న సీబీఐ విచార‌ణ‌కు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. త‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని ఇప్ప‌టికే కోర్టులో ఆమంచి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే దానిపై కోర్టు ఏమీ తేల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే న్యాయ‌మూర్తుల‌పై అనుచిత పోస్టులు పెట్టిన ప‌లువురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమంచి కూడా ఆ జాబితాలోకి ఎక్కుతారా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.