Begin typing your search above and press return to search.

ఆమంచి సంచ‌ల‌నం!... అంతా బాబు కుల‌పోళ్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   14 Feb 2019 5:26 PM GMT
ఆమంచి సంచ‌ల‌నం!... అంతా బాబు కుల‌పోళ్లేన‌ట‌!
X
టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయిన ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్... మొన్న‌టిదాకా చాలా సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఇప్పుడు పార్టీ మారిన త‌ర్వాత మాత్రం ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ఏపీలో పెను క‌ల‌క‌ల‌మే సృష్టిస్తున్నార‌ని చెప్పాలి. టీడీపీకి రాజీనామా చేసి నిన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా టీడీపీలో ఉన్న సంస్కృతి, ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సామాజిక వ‌ర్గ విభేదాలు లేవ‌ని బ‌య‌టకు చెబుతూనే.... మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ కూడా సొంత సామాజిక వ‌ర్గం ల‌బ్ధి అనే ప్రాతిప‌దికన‌నే చంద్ర‌బాబు నెర‌పుతున్నార‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా నేడు విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు (అవంతి శ్రీ‌నివాస్) కూడా టీడీపీకి రాజీనామా చేసి జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగానూ ఆమంచి అక్క‌డ క‌నిపించారు. మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చిన ఆమంచి ఈ ద‌ఫా చంద్ర‌బాబుపై నేరుగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎంఓ మొద‌లు.. నిఘా.. పార్టీ... ప‌రిపాల‌న‌... పోలీస్ శాఖ‌ల్లొ మొత్తం అన్ని కీల‌క విభాగాల్లో త‌న సామాజిక వ‌ర్గం వారికే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా చంద్ర‌బాబు కులం ఏపిని క‌బ‌లించేస్తోంద‌ని ఆమంచి విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రికి కుల పిచ్చి ఉందో లేదో ఆయ‌న చేస్తున్న నియామ‌కాల ద్వారా స్ప‌ష్టం అవుతుంద‌ని కూడా ఆమంచి రుజువుల‌ను కూడా చెప్పేశారు. సీయం కార్యాల‌యంలో న‌లుగురు అధికారులు ఉంటే... అందులో ఇద్ద‌రు రాజ‌మౌళి, సాయి ప్ర‌సాద్ లు చంద్రబాబు సామాజిక‌ వ‌ర్గానికే చెందిన వార‌న‌న్నారు. సీఎం అప్పాయింట్‌మెంట్ ఇచ్చే పీఎస్ కూడా బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారేన‌ని తెలిపారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌హా... అదే నిఘా విభాగంలో కొత్త‌గా తీసుకున్న రిటైర్డ్ అధికారి యోగానంద్, కో ఆర్డినేష‌న్ ప‌ద‌వి ఇచ్చి నియ‌మించుకున్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ సైతం సీఎం సామాజిక వ‌ర్గానికి చెందిన వారేనని ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక పార్టీ ప‌రంగా చంద్ర‌బాబుకు స‌మాచారం ఇచ్చి అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే ఎమ్మెల్సీ టీడీ జ‌నా ర్ద‌న్ సైతం ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని పేర్కొన్నారు.

ఏపిలో ప‌ని చేయ‌లేక ఇక్క‌డి నుండి అనేక మంది అధికారులు కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోగా... కేంద్ర స‌ర్వీసుల‌కు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యూటేష‌న్ మీద వ‌చ్చార‌ని ఆమంచి ఓ పెద్ద చిట్టానే విప్పారు. అందులో 15 మంది ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని ఆమంచి దుయ్య‌బ‌ట్టారు. ఆ అధికారుల్లో ఒకరు రెడ్డి సామాజిక వ‌ర్గం అధికారి ఉంటే... ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్ ఉద‌య్ భాస్క‌ర్ సైతం ముఖ్య‌మంత్రి బంధువునేన‌ని చెప్పిన ఆమంచి.. త‌న సొంత కులానికి ముఖ్య‌మంత్రి దోచి పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కు కుల పిచ్చి లేద‌ని చెబుతున్నా..త‌న‌ చుట్టూ త‌న కులం వారికే స్థానం క‌ల్పించిన చంద్ర‌బాబు.. మొత్తంగా రాష్ట్రాన్నే క‌బ‌ళించేస్తున్నార‌ని ఆరోపించారు. ఇంత‌టితోనే ఈ కులం కార్డు సిరీస్ ముగిసిపోలేద‌ని చెప్పిన ఆమంచి... రేప‌టి నుండి సీయం కుల పిచ్చి గురించి మ‌రిన్ని వివ‌రాలు చెబుతాన‌ని మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు.