Begin typing your search above and press return to search.

బాబుతో భేటీ!... ఆమంచి త‌గ్గ‌లేదండోయ్‌!

By:  Tupaki Desk   |   7 Feb 2019 10:38 AM GMT
బాబుతో భేటీ!... ఆమంచి త‌గ్గ‌లేదండోయ్‌!
X
టీడీపీ ఇప్పుడు నిజంగానే గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కుంటోందనే చెప్పాలి. ఎన్నిక‌ల దాకా ప‌రిస్థితి సాఫీగానే సాగినా... స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పలువురు కీల‌క నేత‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా విన్నింగ్ కేండిడేట్లుగా ఉన్న ఎమ్మెల్యేలు వ‌రుస‌గా పార్టీని వీడుతున్న వైనం టీడీపీకేంటీ... ఏ పార్టీకి అయినా న‌ష్ట‌మే క‌దా. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే టీడీపీకి వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి... టీడీపీకి షాకిచ్చి వైసీపీలో చేరిపోయారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే... ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా నుంచి ఆ పార్టీకి మ‌రో కీల‌క నేత షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే క‌డ‌ప‌లో త‌గిలిన దెబ్బ మాదిరి ఇక్క‌డ కూడా త‌గిలితే ప‌రిస్థితి అంతేన‌ని గ్ర‌హించిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. అయినా కూడా ప‌ని కాలేద‌న్న వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగి స‌త్తా చాటిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌... ఆ త‌ర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయ‌న‌కు క్ర‌మంగా ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చాలా కాలం పాటు ఓపిక ప‌ట్టిన ఆమంచి... ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో త‌న భ‌విష్య‌త్తుపై కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి వైసీపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకున్నారు.

నిన్న ఉద‌య‌మే ఆమంచి వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు. అయితే చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగి త‌న కుమారుడు లోకేశ్ తో ఫోన్ చేయించ‌డంతో పాటు మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును నేరుగా ఆమంచి ద‌గ్గ‌ర‌కే పంపారు. అయినా ఆమంచి త‌గ్గ‌లేదు. దీంతో మ‌రో కోణంలో ఆలోచించిన చంద్ర‌బాబు... ఈ సారి ట్ర‌బుల్ షూట‌ర్ తోట త్రిమూర్తులుతో వ్య‌వ‌హారం చ‌క్క‌బెట్టేందుకు ప్ర‌ణాళిక రూపొందించారు. ఈ ప్ర‌ణాళిక ఓ మేర సానుకూల ఫ‌లితాలు సాధించింద‌ని టీడీపీ ఊపిరి పీల్చుకున్నా... ఆమంచి మ‌రోమారు టీడీపీకి షాకిచ్చారు. నిన్న తోట త్రిమూర్తులుతో భేటీ అయిన ఆమంచి... చంద్రబాబుతో భేటీకి అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు అధికారిక నివాసంలో ఆమంచితో బాబు భేటీ జ‌రిగింది. ఈ భేటీలో త‌న‌కు ఎద‌రైన చేదు అనుభ‌వాల‌ను ఆమంచి ఏక‌రువు పెట్టార‌ట‌. ఇండిపెండెంట్‌గా గెలిచి పార్టీలోకి వ‌స్తే... త‌న‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారికి ఏకంగా రెండు ప‌ద‌వులు ఎలా ఇస్తార‌ని, ఇచ్చినా... త‌న స‌మ్మ‌తి తీసుకోవాలి క‌దా అని కూడా చంద్ర‌బాబును నిల‌దీశార‌ట‌. అంతేకాకుండా అక్క‌డి టీడీపీ కేడ‌ర్‌లో కొంద‌రు కీల‌క వ్య‌క్తులు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని, ఇవ‌న్నీ తెలిసి కూడా పార్టీ సీనియ‌ర్లు ఏమీ తెలియ‌న‌ట్టు న‌టిస్తే ఎలాగని కూడా ఆమంచి ప్రశ్నించార‌ట‌.

అయితే ఆమంచి వాద‌న‌ను సావ‌దానంగా విన్న చంద్ర‌బాబు... ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుతాన‌న్న మాట మాత్ర‌మే చెప్పి... ఆ దిశ‌గా హామీ అయితే ఇవ్వ‌లేద‌ట‌. దీంతో అసంతృప్తిగానే భేటీ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమంచి... పార్టీ మార్పున‌కు సంబంధించి తాను ఇప్ప‌టికిప్పుడు వెన‌క్కు త‌గ్గ‌ట్లేద‌ని, పార్టీ మారేందుకు ఇంకా అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఏ విష‌యాన్ని త‌న అనుచ‌రు వ‌ర్గంతో చ‌ర్చించి చెబుతాన‌ని బాంబు పేల్చారు. చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత కూడా పార్టీ మారే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేశాన‌ని ఆమంచి ప్ర‌క‌టిస్తార‌ని అనుకుంటే... ఇదేంటీ ఇంకా తాను మ‌న‌సు మార్చుకోలేద‌ని చెప్పారంటూ ఇప్పుటు టీడీపీ నేత‌లు ఆయోమ‌యంలో ప‌డిపోయారు. మొత్తంగా బాబుతో భేటీ ఆమంచిని సంతృప్తిప‌ర‌చ‌లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి త‌న అనుచ‌ర వ‌ర్గంతో మాట్లాడాక ఆమంచి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. అయితే మ‌రోమారు బాబుతో భేటీకి సిద్ధ‌మ‌ని ఆమంచి చేసిన ప్ర‌క‌ట‌న ఒక్క‌టే ఇప్పుడు టీడీపీ కొంత‌లో కొంత ఊర‌ట‌గా క‌నిపిస్తోంది.