Begin typing your search above and press return to search.

మ‌రి.. ఆమంచి ప‌రిస్థితి ఏంటి? డ‌మ్మీ అవుతారా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 2:30 AM GMT
మ‌రి.. ఆమంచి ప‌రిస్థితి ఏంటి?  డ‌మ్మీ అవుతారా?
X
ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్కాయి. అధికార పార్టీ వైసీపీలో ప‌రిణామాలు మారిపోతుం డ‌డంతో స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పొలిటిక‌ల్ సీన్ ఎటు తిరుగుతుంది? అనే ప్ర‌శ్న ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తిని వైసీపీ స‌ర్కారు.. త‌న‌కు మ‌ద్ద‌తుగా మార్చుకుంది. ఇక‌, బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌.. వైసీపీ కండువా క‌ప్పుకోగా.. బ‌ల‌రాం.. టెక్నిక‌ల్‌గా టీడీపీలో ఉన్నారు. దీంతో ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై ఓడిపోయిన ఆమంచి ప‌రిస్థితి ఇబ్బందిలో ప‌డిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలోనే ఆమంచి ఇబ్బంది ప‌డుతుంటే.. ఇప్పుడు మ‌రో రూపంలో ఆయ‌న‌కు మ‌రింత సెగ మొద‌లైంది. మూడు రాజ‌ధానులు, సీఆర్‌డీయే ర‌ద్దు బిల్లుల విష‌యంలో శాస‌న మండ‌లిలో వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత.. త‌ర్వాత కాలంలో వైసీపీకి అనుకూలంగా మార‌డం.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, ఇప్పుడు మ‌ళ్లీ అదే ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకుని.. నామినేష‌న్ కూడా వేయ‌డం.. చీరాల‌లో రాజ‌కీయాల‌ను వేడెక్కించింది. ఇక‌, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర కూడా పోతుల సునీత మంచి మార్కులు వేయించుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ఆమంచి వ‌ర్గం.. కిం క‌ర్త‌వ్యం? అని త‌ల‌ప‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీలోకి ముందుగా అడుగు పెట్టింది ఆమంచే. అయితే.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం పెను ఇబ్బందిగా మారింది. త‌ర్వాత మారిన స‌మీక‌ర‌ణ‌ల‌తో ముందు బ‌ల‌రాంను, త‌ర్వాత సునీత‌ను వైసీపీ ఆక‌ర్షించింది. ఫ‌లితంగా అప్ప‌టి వ‌ర‌కు త‌న హ‌వాకు ఎదురు లేద‌ని అనుకున్న ఆమంచి దూకుడుకు అడుగ‌డుగునా బ్రేకులు ప‌డుతున్నాయి. ఇటు బ‌ల‌రాంతోను, అటు సునీత‌తోనూ ఆమంచికి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్ద‌రు కూడా వైసీపీకి అత్యంత స‌న్నిహితులుగా మారిపోయారు.

దీంతో త‌న ప‌రిస్థితి ఏంటి? ఇక‌నుంచి త‌న‌పై ఈ ఇద్ద‌రుమ‌రింత పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఖాయ‌మ‌ని ఆమంచి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌కు టికెట్ ఉంటుందో ఉండ‌దో కూడా తెలియ‌ని ప‌రిస్థితి! దీంతో మ‌రి.. మా నాయ‌కుడు ఆమంచి ఫ్యూచ‌ర్ ఏంటి? అని ఆయ‌న వ‌ర్గం త‌ల్ల‌డిల్లుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.