Begin typing your search above and press return to search.

వరల్డ్ నంబర్ 1 శ్రీమంతుడు

By:  Tupaki Desk   |   25 Oct 2015 10:36 AM GMT
వరల్డ్ నంబర్ 1 శ్రీమంతుడు
X
అమన్షియో ఆర్టెగా... పేపర్లు - టీవీల్లో ఎన్నడూ కనిపించని, వినిపించని ఈ పేరు మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, అంతర్జాతీయ వ్యాపారవర్గాల్లో ఆయన బాగా పాపులర్. 89 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. అయినా చాలా లో ప్రొఫైల్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన పేరు పాపులరైంది. అందుకు కారణం బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టి ఆయన ప్రపంచంలో అత్యధిక సంపన్నుడిగా నిలవడమే. 89 దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఆయన ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 శ్రీమంతుడు.

స్పానిష్‌ రిటైల్‌ దిగ్గజం 'అమన్షియో ఆర్టెగా' తొలిసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్ను డిగా నిలిచారు. తద్వారా బిల్‌ గేట్స్‌ ను వెనక్కినెట్టారు. దుస్తుల కంపెనీ జారాకు అధినేత అయిన ఆర్టెగా 89 దేశాలలో 6,000 స్టోర్లను స్థాపించారు. ఫోర్బ్స్‌ మ్యాగజీన్ లెక్క ప్రకారం ఆర్టెగా సంపద 79.8 బిలియన్‌ డాలర్లు. స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన అతడి సంస్థ ఇండిటెక్స్‌ షేరు శుక్రవారం దాదాపు 34 యూరోల వద్ద ముగిసింది. జారా - పుల్‌ అండ్‌ బేర్‌ - మాసిమో డట్టి బ్రాండ్లు ఈ కంపెనీ సొంతం. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రస్తుత సంపద శుక్ర వారంనాటి షేరు ముగింపు ధర 52.87 డాలర్ల ప్రకారం 79.4 బిలియన్‌ డాలర్లు. ఆ తరువాత స్థానంలో 66.7 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో సుప్రసిద్ధ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ వారన్‌ బఫెట్‌ నిలిచారు.

రైల్వే కార్మికుడి కొడుకైన ఆర్టెగా, అతడి భార్య రొసాలియా మేరాతో కలసి 1975లో జారాను ఏర్పాటు చేసాడు. ఆర్టెగా 1936లో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. యుక్త వయసులో ఉండగా స్కూల్‌ విద్యను వొదిలి స్పెయిన్‌ లో షర్టులు కుట్టే పనివాడిగా కుదిరాడు. డెలివరీ బాయ్‌ గా పనిచేయడం మొదలు పెట్టాడు. స్పెయిన్‌ లో తొలుత నైట్‌ గౌన్లు - పిల్లల దుస్తులు - లోదుస్తులు విక్రయించే నిమిత్తం జారాను స్థాపించాడు. ప్రస్తుతం జారాలో ఆర్టెగాకు 59 శాతం వాటా ఉంది. కాగా, 1986లో ఆర్టెగా - మేరా విడిపోయారు. 2013 ఆగస్టులో మేరా మెదడు సంబంధవ్యాధితో మరణించడంతో కూతురు సాండ్రా ఆర్టెగా మేరాకు 7.3 బిలియన్‌ డాలర్ల విలువైన వాటా వారసత్వంగా లభించింది. దీంతో స్పెయిన్‌ లోనే ఆమె రెండో సంపన్న వ్యక్తిగా అవతరించింది. ఇక ఆర్టెగా రెండో భార్య 61ఏళ్ల ఫ్లోరా పెరెజ్‌ ఇండిటెక్స్‌ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.

ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఫొటోగ్రాఫ్‌ లు ప్రచురించుకోవడం వంటివి అంతగా ఇష్టపడని ఆర్టెగా ఈ బాటలో 2001లో ఇండిటెక్స్‌ లిస్టింగ్‌ సమయంలో కూడా స్టాక్‌ మార్కెట్లకు హాజరుకాకపోవడం గమనార్హం! వ్యాపార వ్యూహాలపైనే ఎల్లప్పుడూ మనసు నిలిపే ఆర్టెగా అత్యంత సంపన్న సంస్థగా ఇండిటెక్స్‌ ను రూపుదిద్దాడు. నిధులను మళ్లించి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టేవాడు. లండన్‌ - మాడ్రిడ్‌ - బార్సిలోనా - చికాగోలలో పలు భవనాలను కొనుగోలు చేసాడు. సెప్టెంబర్‌ లో మియామీలో 37 కోట్ల డాలర్లతో రిటైల్‌ బిజినెస్‌ కు అనువైన స్థలాన్ని కొనుగోలు చేసాడు. అతడి రియల్ ఎస్టేట్ సంస్థ పొంటెగాడియా ఇన్‌ మోడిలియారియా ఆస్తుల విలువ 2012లోనే 5 బిలియన్‌ యూరోలుగా నమోదైంది.